ప్రేమా? ద్వేషమా? మీరే నిర్ణయించుకోండి!

 

 

ఒక బడిలో పిల్లలు నిరంతరం గొడవలుపడుతూ, కొట్టుకుంటూ ఉండేవారు. పిల్లలంతా చదువులో బాగున్నారు, ఆటపాటల్లో బాగున్నారు. కానీ వారిలో సంస్కారం మాత్రం లేదని ఉపాధ్యాయులంతా తెగ బాధపడేవారు. ఇంత చిన్న వయసులోనే ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారంటూ దిగాలు పడిపోయేవారు.

పిల్లల తీరు మార్చేందుకు ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా ప్రభావం లేకుండా పోయింది. చివరికి ఓ ఉపాధ్యాయుడికి ఓ ఆలోచన తట్టింది. మర్నాడు తన తరగతిలో అడుగుపెడుతూనే ఆ ఉపాధ్యాయుడు ‘నేను మీతో ఓ సరదా ప్రయోగం చేయించాలనుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని చివరివరకూ చేసినవారికి పరీక్షలలో ఐదేసి మార్కులు కలుపుతాను,’ అన్నాడు.

ప్రయోగం, మార్కులు అనగానే పిల్లలంతా ఉత్సాహంగా తల ఊపారు. ‘మీకు ఈ ప్రపంచంలో కొందరు ఇష్టం ఉండకపోవచ్చు కదా! అలా మీకు ఎంతమందిమీద ద్వేషం ఉంటే అన్ని టమాటాలని రేపు తీసుకురండి,’ అని చెప్పాడు. టీచరుగారు చెప్పింది సరదాగానే ఉంది. దాంతో ఒకో విద్యార్థీ తనకి ఎందరి మీద ద్వేషం ఉందో అన్నేసి టమాటాలు తీసుకువచ్చాడు.

కొందరు మూడు టమాటాలతో సరిపెట్టుకున్నారు, కొందరు పది తెచ్చారు, ఇంకొందరు ఏకంగా ఇరవై టమాటాలు మోసుకువచ్చారు. ‘వెరీ గుడ్‌! మీరు తెచ్చిన టమాటాలన్నీ మీ డెస్క్‌లో పెట్టుకోండి. ఒక వారం గడిచాక వాటిని తీసేయవచ్చు. ఇదే మీరు చేయబోయే ప్రయోగం,’ అన్నారు టీచరుగారు.

టీచరుగారి మాటలకు పిల్లలు పగలబడి నవ్వారు. ఇది కూడా ఓ ప్రయోగమేనా! అంటూ గుసగుసలాడుతూ  ఎగతాళి చేశారు. కానీ ఎంతైనా టీచరు కదా! అందుకని మారుమాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేశారు.

ఓ రెండు రోజులు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత మొదలైంది అసలు కథ! డెస్క్‌లో టామాటాలు గభాలున చేయి తగిలితే పగిలిపోయేవి. మరికొన్ని కుళ్లపోయేవి. దాంతో పుస్తకాలు పెట్టుకోవడానికి కాదు కదా! కనీసం తలుపు తెరిచి చూడ్డానికి కూడా విద్యార్థులకి భయం వేసిపోయింది. ఎక్కువ టమాటాలు ఉన్నవారి బాధ మరింత ఎక్కువగా ఉంది.

వాళ్లు బడికి రావడానికే భయపడిపోయారు. డెస్క్‌ మీద చేయి వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఇలా వారం రోజులూ క్షణమొక యుగంగా గడిచాయి. చివరి రోజుకి పిల్లలంతా బిక్కచచ్చిపోయి ఉన్నారు.

‘నేను చెప్పినట్లుగానే ప్రయోగం కోసం మీరంతా వారం పాటు టమాటాలను మీ దగ్గర ఉంచుకున్నారు. ఈ పరీక్షలో మీరంతా నెగ్గారు కాబట్టి మీ అందరికీ ఐదేసి మార్కులు ఇస్తున్నాను. కానీ మార్కులకి మించిన పాఠం ఒకటి మీరు తెలుసుకోవాల్సి ఉంది,’ అన్నారు టీచరుగారు చిరునవ్వుతో!


టీచరు మాటలకి విద్యార్థులందరూ నోరువెళ్లబెట్టుకొని చూశారు. వాళ్లని చూస్తూ టీచరుగారు ఇలా చెప్పారు... ‘మీరు ఏర్పరుచుకున్న ద్వేషాలు మీ డెస్క్‌లో ఉన్న టమాటాలులాంటివి.

ఎంతమంది మీద ద్వేషం ఏర్పరుచుకుంటే మీ మనసులో అంత దుర్గంధం చేరుతుంది. చూసేవాళ్లకి కూడా మీ మనసు అంత స్వచ్ఛంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. క్రమంగా అంతా మీ నుంచి దూరమైపోతారు. కొన్నాళ్లకి మీరే మీకు అర్థం కాకుండా పోతారు.

మనసులో ఏదో తెలియని బరువు, చిరాకు మాత్రమే మిగులుతాయి. ప్రేమ, కరుణలాంటి గుణాలు దూరమైపోతాయి. ద్వేషంతో మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాలా? ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించాలా?’ మీరే నిర్ణయించుకోండి అంటూ ముగించారు టీచరుగారు. ఆయన మాటలు విన్న విద్యార్థులంతా ఆలోచనలో మునిగిపోయారు.


(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.