శత్రువులు మారొచ్చు గాక

మనం చిన్నప్పుడు బయటి ప్రపంచం గురించి అంతగా అవగాహన లేని సమయంలో మన పాఠ్యాంశాల్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 ఏళ్ళు దోచుకెళ్లారు. కాబట్టి, మన ప్రథమ శత్రువులు వాళ్ళే అని అప్పట్లో నిర్ణయించుకున్నాం. తర్వాత మన పెద్దలు, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత్ కి అసలు ప్రధాన శత్రువు పాకిస్తాన్. 

 

ఒకప్పుడు కలిసి ఉన్న మన సహోదరులు, బ్రిటిషర్లు పెట్టిన మత చిచ్చులో ఉడికి, ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం చేసిన సమయంలో, ఎందుకులే ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టి కలసి ఉండడం అని, మహాత్మా గాంధీ దేశం విడిపోవాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహానుభావుడు, ఆ సమస్య అక్కడితో సమసిపోతుందని అనుకొని ఉండొచ్చు. కానీ, కాశ్మీర్ లో కొంత భాగం సమర్పించినప్పటికీ ఇండియా, పాకిస్తాన్ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఉగ్ర రూపంలో మన దేశంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

 

అయితే, మనకి పాకిస్తాన్ ని మించిన శత్రువు ఒకరున్నారు తెలుసా? పాకిస్థానీయులకి తెలివి తేటలు నిల్ కాబట్టి, వాళ్ళను ఉపయోగించుకొని తమకి పెద్ద పోటీదారు అయినా భారత్ ని దొంగ దెబ్బ కొట్టే విషయంలో 'డ్రాగన్' దేశం చైనా ఎప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. 2014 వరకు చైనా ఆటలు సాగినా..నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రాగన్ పప్పులు ఉడకడం లేదు.

 

మోడీ ఏంటి మాటి..మాటికి విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇక దేశం గురించి పట్టించుకునే దెప్పుడు అని. విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో కొందరు, 'ఏది చెబితే' అది నమ్మే వాళ్ళు అవును మోడీ దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు అని తమ గొంతు కలిపారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు మోడీ 'విదేశీ పర్యటనల' వెనుక రహస్యం ఇప్పడిప్పడే అర్ధమవుతోంది. భారత్ కి మిత్రులని పెంచుకోవడం... తద్వారా మన బలం ఇది అని చైనా కి హెచ్చరికలు పంపడం... ఇది మోడీ వ్యూహం.

 

చైనా మీడియా లో మాత్రం ఇండియా చేస్తుంది అక్షరాలా తప్పు అని సరిహద్దు దేశాలన్నిటితో గొడవలు పెట్టుకుంటుందని అవాకులు, చవాకులు పేలుతుంది. ఈ విషయం వచ్చిన ప్రతిసారి '1962 ' గుర్తుంది కదా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది డ్రాగన్. కానీ, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్ లో అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులకీ భారీ తేడా ఉంది. ఇప్పుడు మనతో పెట్టుకుంటే చెడేది తామే అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆ మధ్య ఇండియా, అమెరికా, జపాన్ నావికా దళాలు బంగాళాఖాతంలో చేసిన విన్యాసాలు చైనాకి గుబులు పుట్టిస్తున్నాయి.

 

ఒకటి మాత్రం వాస్తవం, మనకి శత్రువులు పెరుగుతున్నారు, లేదా మారుతున్నారు అంటే అర్ధం మనం చెడ్డ వాళ్ళం అని కాదు, అతి మంచి కూడా కొన్ని సార్లు చెడు చేస్తుంది. ఈ విషయం గుర్తు పెట్టుకుని ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు కొనసాగించాలి.