ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పట్నుంచి మరో లెక్క... లైట్‌ తీస్కుంటే లైసెన్స్‌ రద్దే...

 

రెడ్‌ సిగ్నల్‌ పడినా...రయ్‌‌మంటూ దూసుకుపోతున్నారా? సీసీ కెమెరాల్లేవని పదేపదే రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్నారా? హెల్మె‌ట్‌ పెట్టుకోవడం లేదా? మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారా? రాంగ్‌ రూట్లో వెళ్లిపోతున్నారా? ఎలా వెళ్లినా ఫైన్‌ కడితే చాలు కదా అనే ధీమాతో ఉన్నారా? అయితే ఇకపై మీ ఆటలు చెల్లవు. ఎందుకంటే ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పట్నుంచి మరో లెక్క అంటున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఇకపై ట్రాఫిక్స్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. రూల్స్‌ని లైట్‌ తీసుకుంటే లైసెన్స్‌ రద్దయిపోవడం ఖాయమంటున్నారు.

 

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే తాట తీయనున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో పాయింట్ల విధానాన్ని అమలు చేయబోతున్నారు. 12 పాయింట్లు వస్తే.... డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. 12వ పాయింట్ నమోదైన రోజు నుంచే లైసెన్స్ సస్పెన్షన్ అమల్లోకి వస్తుంది. ఉల్లంఘనలకు సంబంధించిన పాయింట్లను ఆర్టీఏ డేటాబేస్ లో పకడ్బందీగా నమోదు చేయనున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే... పాయింట్ల విధానం ద్వారా లెక్కించనున్నారు. హెల్మెట్‌, సీటు బెల్టు పెట్టుకోకపోతే ఒక్క పాయింట్‌... తాగి నడిపితే మూడు పాయింట్లు... ఇలా 12 పాయింట్లు దాటితే లైసెన్స్‌ రద్దు చేయనున్నారు. లెర్నింగ్‌ లైసెన్స్‌దారులకైతే 5 పాయింట్స్‌ దాటితేనే రద్దు చేయనున్నారు. గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకున్నా.... రాంగ్‌ రూట్లో వెళ్లినా... ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్్ లేకపోయినా... ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేసినా... రెండు పాయింట్ల పెనాల్టీ పడనుంది. ఇలా ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన పాయింట్‌ విధానంతో వాహనదారులకు చుక్కలు చూపించనున్నారు. లైసెన్స్‌ రద్దు చేసినా వాహనం నడిపితే జైలుశిక్ష విధించేలా పాయింట్స్‌ విధానాన్ని రూపొందించారు. ఆటోలో ఎక్స్‌ట్రా ప్యాసింజర్‌ను ఎక్కించుకుంటే ఒక పాయింట్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంప్‌, జీబ్రా లైన్స్‌ క్రాసింగ్‌‌కి 2 పాయింట్లు, కండీషన్‌లో లేని వాహనాలు నడిపితే 2 పాయింట్లు, స్పీడ్‌ లిమిట్‌ దాటితే రెండు పాయింట్లు, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో టూవీలర్‌ పట్టుబడితే 3 పాయింట్లు, రేసింగ్‌లకు పాల్పడితే మూడు పాయింట్లు, ఫోర్ వీలర్స్‌‌తో పట్టుబడితే 4 పాయింట్లు.... అదే బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు పట్టుబడితే 5 పాయింట్ల పెనాల్టీ పడనుంది.

 

ఓవరాల్‌గా పాయింట్ల విధానంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు బ్రేక్‌ వేయనున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పట్నుంచి మరో లెక్క  అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విధానంలో ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదంటున్నారు. సో...ఇప్పట్నుంచైనా ట్రాఫిక్స్‌ రూల్స్‌ పాటిద్దాం... రోడ్డుప్రమాదాలను నివారిద్దాం... మనల్ని మనమే కాపాడుకుందాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu