"ఇర్మా" ఇండియాలో వస్తే..?

గత కొద్ది రోజులుగా ప్రపంచం మొత్తం వినిపిస్తున్న మాట..మాట్లాడుకుంటున్న విషయం ఒకటే.. "ఇర్మా". అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఈ రాకాసి దెబ్బకు కరేబియన్ దీవులు, క్యూబా, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం చివురుటాకుల్లా వణికిపోయాయి. గంటకు సుమారు 350 నుంచి 400 కి.మీ వేగంతో వీచిన గాలులకు భారీ భవనాలు నామ రూపాల్లేకుండా పోయాయి..పెద్ద పెద్ద వృక్షాలు సైతం చీపురు పుల్లల్లా విరిగిపడిపోయాయి. సుమారు 65 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎంతటి విపత్తునైనా అంచనా వేసి అందుకు ధీటుగా స్పందించగల అగ్రరాజ్యం సైతం ఇర్మాను చూసి హడలిపోయింది.

 

అట్లాంటిక్‌లో ఏర్పడిన ఈ హరికేన్ ఎన్నో రెట్లు పెద్దదని..ఫ్లోరిడాకు ఏదో ఒక దిశ నుంచి కాకుండా నలువైపుల నుంచి భయంకరమైన గాలులు వీస్తాయని..ఫ్లోరిడా పెవిన్సులాలో ఎక్కడున్నా ప్రమాదమేనని..కాబట్టి సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని..హరికేన్ అగ్రరాజ్యం వైపు దూసుకోస్తున్న వేళ ఆ రాష్ట్ర గవర్నర్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంత సాధనా సంపత్తి ఉన్న అమెరికాయే ఈ స్థాయిలో భయపడితే..అలాంటి హరికేను భారతదేశంలో వస్తే పరిస్థితి ఏంటి..? మనం ఎంత వరకు దానిని ఎదుర్కోగలం అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

 

విపత్తులు మనకు కొత్త కాదు..వాటిని ఎదుర్కోవడంలో మనదేశానికి ఎంతో అనుభవం ఉంది. 1900 నుంచి నేటి వరకు ఇండియా అనేక విపత్తులను చవిచూసింది. ఈ మధ్యకాలంలో 90 లక్షలకు పైగా జననష్టం సంభవించింది. మొదట్లో మరణాల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రభుత్వం అమలు చేసిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రామ్‌ వలన నష్టశాతం తగ్గింది. అనేక అంతర్జాతీయ సంస్థల సహకారంతో పాటు భారత్‌ అభివృద్ది చేసుకున్న టెక్నాలజీ సాయంతో ఎన్నో ఘోరాలను ఆపగలిగాం. అయితే ప్రకృతితో పోరులో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయామని నిపుణుల మాట. మనదేశ భూ భౌగోళిక పరిస్థితుల రీత్యా హరికేన్ల సమస్య మనకు లేదు. కానీ హరికేన్లతో పోలిస్తే అతి తక్కువ శక్తివంతమైన తుఫాన్లకి భారత్ విలవిలలాడిపోతోంది.

 

prevention is better than cure అన్న సూక్తిని ఈ విషయంలోనూ అన్వయించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2010 ప్రాంతంలో హైతీ, చిలీ, కాలిఫోర్నియాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. చిలీ, కాలిఫోర్నియాల్లో సంభవించిన భూకంపాలు హైతీలో కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చినప్పటికీ..హైతీలో 2,30,000 మంది మరణించగా..చిలీలో కొన్ని వందల మంది, కాలిఫోర్నియాలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే మరణించారు.దీనికి కారణం భవనాల నిర్మాణాల విషయంలో ప్రమాణాలు పాటించడమే. ఒక్కటి మాత్రం నిజం ఆపదలు చెప్పిరావు..ఎప్పుడు ఏ రూపంలో..ఎంత తీవ్రతతో దాడి చేసినా అంతే ధాటిగా, ధీటుగా వాటిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాల్సిందే. లేకపోతే రెప్పపాటులో అంతులేని అనర్థం జరిగిపోతుంది.