ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు

 

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాలలో వర్షం పడుతూనే ఉంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లి, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజమాల, అవుకు మండలాలలో భారీగా వర్షం కురిసింది. కోయిలకుంట్ల-అవుకు మధ్య పాలేయ వాగు పొంగిపొర్లుతోంది. వెలిగోడు మండలం మార్లమడికి సమీపంలో వేదావతి నది పొంగిపొర్లుతోంది. దాంతో బళ్లారి, కర్నూలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మండలాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ మండలాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలలో ఏలూరుతోపాటు పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడ్డాయి. ఇదిలా వుండగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మబ్బులు పట్టి చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చలి వాతావరణం ఏర్పడింది.