దేశ విదేశాలలో దీపావళి ఇలా...

* దీపావళి రోజున మార్వాడీలు లక్షీ పూజను ఘనంగా జరుపుతారు. వ్యాపారస్తులు తమ ఖాతాలను ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు.

* మహారాష్ట్రలో  దీపావళిని అన్నాచెల్లెళ్ళ పండగగా కూడా జరుపుకుంటారు. ఆ రోజున అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళను ఆహ్వానించి విందు జరిపి చీరలు మొదలైన కానుకలు ఇస్తారు.

* పంజాబ్ లో సిక్కులు దీపావళిని మహా వైభవంగా జరుపుకుంటారు సిక్కుల గురువు హరగోవింద్ సింగ్ మొఘల్ పాలకుల బందిఖానా నుంచి దీపావళి రోజునే విడుదలయ్యాడు. ఆ కారణంగా సిక్కులు దీపావళిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. సిక్కుల పవిత్రమైన దేవాలయం స్వర్ణదేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు.

* బెంగాలీవారు, ఒరియావారు దీపావళి సందర్భంగా కాళీమాతను పూజిస్తారు.

* మలయాళీలు దీపావళి రోజున బలిచక్రవర్తికి పూజలు చేస్తారు.

* తమిళనాడులో అన్నదమ్ములు తమ తోబుట్టువులను ఇంటికి పిల్చి  చీరలు కానుకగా ఇవ్వడం ఆచారం.

* రాజస్థాన్‌లో దీపావళి రోజున అగ్ని పూజ చేస్తారు. దీనిని వారు ‘‘ హిచ్’’ అంటారు హిచ్ అంటే అర్థం మట్టికుంపటి. మగవారు ఈ కుంపటిని వెలిగించి ఊరంతా తిప్పుతారు.

* ఉత్తర కర్ణాటక జిల్లాలలో దీపావళి రోజున దీపాలను వెలిగించి పశువుల ఎదురుగా పెడతారు. దీన్నే వారు ఆణీ , పేణీ అంటారు. ఆ విధంగా చేయడం వల్ల పశువులు ఆరోగ్యంగా వుండి పశుసంపద పెరుగుతుందని వారి విశ్వాసం.

* మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజున ముత్తైదువులను ప్రత్యేకంగా సత్కరిస్తారు. నూతన వస్త్రాలు పళ్ళు బహుకరిస్తారు. ముత్తైదువులు అన్నాన్ని రాసిగా పోసి భగవంతునికి సమర్పిస్తారు. దీనిని వారు ‘‘అన్నకూట్’’ అంటారు.

* బర్మా దేశంలో దీపావళిని ‘‘తంగీజు’’  అంటారు. బుద్ధుడుదీపావళి నాడే భూమ్మీదకు వచ్చాడని వారి నమ్మకం.

* నేపాల్ దేశంలో దీపావళిని  ఐదు రోజుల పండగగా చేసుకుంటారు దీన్ని వారు ‘పంచక్’ అంటారు.

* కంబోడియా దేశంలో కూడా దీపావళిని వేడుకగా చేసుకుంటారు.  గతంలో కాంభోజ రాజ్యంగా పిలిచే ఈ  దేశాన్ని  పూర్వం హిందూరాజులు కొంతకాలం పరిపాలించారు. ఆ  కారణంగా దీపావళి అక్కడ ప్రాచుర్యంలోకి వచ్చింది.