ఎంపీని అరెస్ట్ చేసి తీసుకురండి...

 

పలుమార్లు కోర్టుకు గైర్హాజరు కావడంతో ఓ ఎంపీని అరెస్ట్ చేసి తీసుకొని రమ్మని ఆదేశించారు జడ్జి. ఇంతకీ ఎవరా ఎంపీ... ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. గుజరాత్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...సురేంద్ర నగర్ బీజేపీ ఎంపీ దేవ్ జీ ఫతేపురా ఎన్నికల సమయంలో ఖర్చుల నిమిత్తం ప్రభాత్ సిన్హా ఠాకూర్ అనే వ్యక్తి నుంచి కోటిన్నర రూపాయలు రుణంగా తీసుకున్నాడు. అయితే ఆ తరువాత చెల్లని చెక్కిచ్చి అతనిని మోసం చేశాడు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత దేవ్ జీ ఇచ్చిన చెక్కును ఠాకూర్ బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. డబ్బులు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో ఠాకూర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో దేవ్ జీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అంతేకాదు కోర్టు ఇప్పటికే పలుమార్లు దేవ్ జీ కి నోటీసులు జారీ చేసింది. కానీ దేవ్ జీ మాత్రం కోర్టుకు హాజరుకాకపోవడంతో కేసును విచారించిన న్యాయమూర్తి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. తదుపరి విచారణకు అతనిని అరెస్ట్ చేసి అయినా కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు.