గ్రీన్ ఫీల్డ్ వాసులకు శంకరన్న ఉసురు తగిలిందా?

 

గత పది సం.లుగా హైదరాబాదులో గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీ వాసులు మాజీ మంత్రి శంకరావు తమ ఇళ్ళ స్థలాలను లాక్కొనే ప్రయత్నంలో అయన, అయన సోదరుడు దయకరావు ఇద్దరూ కూడా బెదిరింపులకి పాల్పడుతున్నారని కోర్టులో కేసువేసి వారితో తిప్పలు పడుతున్నారు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో మొన్న జనవరి 31వ తేదీన పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, మళ్ళీ అంతలోనే ఆయన ఆరోగ్యపరిస్థితి చూసి భయపడి ఆసుపత్రికి తరలించడంతో, ఒక్కసారిగా దళిత సంఘాలు, రాజకీయ నాయకులూ కదలివచ్చి అందరూ ఆయనకు మద్దతుగా మాట్లాడేసరికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెనక్కి తగ్గక తప్పలేదు.

 

శంకరావును పోలీసులు అవమానకర రీతిలో తరలించారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిఐడీ అధికారులతో ఒక కమిటీ వేసినప్పటికీ, శంకరావు కుటుంబ సభ్యులు వారికి సహకరించక సీబీఐ చేత విచారణ చేయించాలని పట్టుబట్టారు.

 

ఈ క్రమంలో ‘తమ గోడు వినిపించుకొనే నాధుడే లేడా?’ అంటూ గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీ వాసులు మీడియాతో మోర పెట్టుకొన్నపటికీ అదికూడా అరణ్యరోదన అయిపోయింది. కానీ, ఈ సంఘటన జరిగిన తరువాత తెరవెనుక ఏమి మంత్రాంగం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ, ఈ రోజు రెవెన్యు అధికారులు భారీపోలీసు బందోబస్తు సహాయంతో తరలివచ్చి గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో నిర్మించిన అక్రమకట్టడాలు కూల్చేశారు. పెద్దలతో పెట్టుకొంటే ఏమవుతుందో బాగా అనుభవమయిందని గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న పేదలు, పదవీ విరమణ చేసిన వారు ఇప్పుడ తీరికగా బాధపడుతున్నారు. అందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని శంకరావు సోదరుడు దయకరావు చెప్పడం కొస మెరుపు.