కూతురు కోసం విజయనగర సామ్రాజ్యం
posted on Nov 16, 2016 12:05PM

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న తిప్పలు ఆ దేవుడికే ఎరుక. చేతిలో డబ్బులుండి కూడా కనీసం భోజనం చేయలేని పరిస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు పనులు మానుకుని మారి జనం బ్యాంకుల ముందు బారులు తీరుతుండగా..కొందరు అవినీతిపరులు నల్లడబ్బును ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా జైలు జీవితం గడిపివచ్చిన...మైనింగ్ కింగ్ గాలిజనార్థన్ రెడ్డిపై మాత్రం ఈ నోట్ల ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదని చెప్పవచ్చు. గాలి కుమార్తె బ్రహ్మాణి వివాహం, హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ రెడ్డితో నవంబర్ 16న నిశ్చయమైంది. అయితే పెద్ద నోట్ల రద్దు..ఈ వివాహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని దేశం మొత్తం భావించింది. కానీ వివాహ వేదిక బెంగళూరు ప్యాలెస్ వద్ద తాజా పరిస్థితిని చూస్తే మాత్రం అవన్నీ పుకార్లేనని అర్థమవుతోంది..పెళ్లికి ఒక్కరోజే సమయం ఉండటంతో అక్కడ అప్పుడే సందడి మొదలైపోయింది.

ఆ సంగతి పక్కనబెడితే పెళ్లి కోసం తనను తాను అభినవ శ్రీకృష్ణదేవరాయుడిగా ఫిలయ్యే గాలి వారు విజయనగర సామ్రాజ్యాన్నే పునర్నిర్మిస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్ ఆవరణలోని 36 ఎకరాల స్థలంలో ఈ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. వివాహ వేదికను హంపిలోని ప్రఖ్యాత విజయ విఠల దేవాలయాన్ని పోలి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎనిమిది పురోహితులు వివాహన్ని జరిపించనున్నారు. వీటితో పాటుగా లోటస్ మహల్, మహనవమి దిబ్బను కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బెలగావిలో తాను నివసించిన ఇంటిని కూడా నిర్మించి దానికి కూతురికి, అల్లుడికి కానుకగా అప్పగించనున్నాడు గాలి. ఇక పెళ్లికూతురు అలంకరణ విషయానికి వస్తే పెళ్లిరోజు 17 కోట్లు ఖరీదు చేసే ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరకు తోడుగా 90 కోట్లు విలువచేసే నగలను బ్రహ్మాణికి అలంకరించనున్నారు.