బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సీఐడీ కేసు

 

వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్‌ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై  పౌరసత్వంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్‌ నెలలో చెన్నమనేని రమేష్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది  చెన్నమనేని రమేష్‌ మొదలు చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొనసాగుతోంది. పౌరసత్వ వివాదంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలను సోమవారం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టు ద్వారా అందజేశారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో సవాల్‌ చేయగా.. ఆయన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి కొట్టివేసింది. అంతేగాకుండా పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి రూ.5 లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతమంతా  తిరిగి ఇచ్చేయాలని సీపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన న్యాయ వ్యవస్థలను,కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శించారు. ఇండియన్ సిటిజన్ కాకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతం తీసుకున్నాడని..అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని అనేక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందాడన్నారు. అందుకే ఆయన తీసుకున్న ఎమ్మెల్యే పదవికాలంలో తీసుకున్న మొత్తం  జీతం అంతా తిరిగి ఇచ్చేయాలని..దీనిపై అవసరమైతే తాను కోర్టును కూడా ఆశ్రయిస్తామని  నారాయణ స్పష్టంచేశారు. 


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu