రాజ్ క‌సిరెడ్డి ఆప‌రేష‌న్స్ ఎలాగుండేవంటే?

విజ‌య‌సాయి రెడ్డి చెప్పిన‌ట్టు రాజ్ క‌సిరెడ్డి తెలివైన వాడే. ఆయ‌న మ‌ద్యం డ‌బ్బును ఎలా చేతులు మారుస్తారంటే.. ర‌క ర‌కాల విధానాల్లో వాటిని దారి మ‌ళ్లించి తిరిగి ఆ మొత్తం డ‌బ్బును ఒక చోట చేర్చ‌డంలో త‌న తెలివైన హైటెక్ బుర్ర‌ను వాడుతుంటారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వివిధ‌ డిస్ట‌ల‌రీల ద్వారా వ‌చ్చే మ‌ద్యాన్ని భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆ మొత్తం డిజిట‌ల్ గా కాక, హార్డ్ క్యాష్ గా తీసుకున్న‌దీ విదిత‌మే. అయితే ఈ మొత్తం డ‌బ్బు త‌ర‌లింపులో రాజ్ క‌సిరెడ్డి త‌న‌ ప‌నిత‌న‌మంతా చూపారని అంటారు.

మొత్తంగా నాలుగు విధానాల ద్వారా ఈ డ‌బ్బు ఒక వైసీపీ ఎంపీ ద‌గ్గ‌ర‌కు చేర్చేవాడ‌ని తెలుస్తోంది. ఆ విధానాలేంట‌ని చూస్తే అది మొద‌టిది సినిమా కాగా, రెండు న‌గ‌ల షాపులు, మూడు రియ‌ల్ ఎస్టేట్, నాలుగు అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీల‌కు చెల్లింపులు.  కావాల‌ని ఫ్లాప్ సినిమాలు తీసి వాటి ద్వారా భారీ  ఎత్తున ఖ‌ర్చు చూపించి.. ఆపై వాటిని బ్లాక్, వైట్ చేసుకోవ‌డం అన్న‌ది ఒక రూట్ మ్యాప్. ఇక రెండోది న‌గ‌ల దుకాణాల‌కు 20 శాతం క‌మిష‌న్ ద్వారా  బ్లాక్ మనీని వైట్ చేస్తుంటార‌న‌మాట‌. ఇక రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డుల సంగ‌తి తెలిసిందే.  బ్లాక్ మనీ వైట్ అవ‌డానికి ఇక్క‌డున్నంత బెస్ట్ మెథ‌డ్స్ మ‌రొక చోట దొర‌క‌వు మ‌న‌కు. మ‌నీలాండ‌రింగ్ కి అనువైన వేదిక కూడా రియ‌ల్ రంగ‌మే.

మ‌రో మార్గం అడ్వ‌ర్టైజింగ్ కంపెనీలు.. వీటి ద్వారా ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన వీడియోల రూప‌క‌ల్ప‌న చేయిస్తున్న‌ట్టు, ఇంకా ఎన్నో ర‌కాల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు.. ఒక ప్లాన్ వేస్తారు. ఈ ప‌థ‌కం ప్ర‌కారం.. వారికి భారీ ఎత్తున డ‌బ్బు చెల్లించిన‌ట్టు చూపిస్తారు. క‌ట్ చేస్తే ఆ మొత్తాన్ని 20 శాతం క‌మిష‌న్ రూపంలో తిరిగి త‌మకు చేరేలా చేసుకుంటారు.

ఈ మొత్తం సిండికేట్.. గ‌త పాల‌న‌లో నాలుగేళ్ల పాటు ఆ మాట‌కొస్తే ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ య‌ధేచ్చ‌గా సాగిన‌ట్టు స‌మాచారం. ఇపుడీ వివ‌రాల‌నే కూపీ లాగుతున్నారు అధికారులు. ఏది ఏమైనా ఈ మొత్తంలో త‌లా పాపం తిలా పిడికెడుగా భావిస్తున్నారు. మ‌రి చూడాలి.. ఇంకా ఎన్నేసి ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో?