అన్నదాతల ఆత్మహత్యలు.. ఆపేవారెవరూ?

 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. వర్షాలు రాక.. పంటలకు సరైన నీరు లేక.. పంటలు వేసిన సరిగా పండక పెట్టిన పెట్టుబడి కూడా రాక కడలోతు కష్టాల్లో కురుకుపోతున్న రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చావు ఒక్కటే మార్గమని తమ ప్రాణాలను బలిగొంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జిల్లాలలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు రాజదాని నడిబొడ్డున రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మరి ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వాలు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నాయా అంటే అదీలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రాజకీయ నాయకులు చేసిందని ఓ పదివంతు అయితే విద్యార్ధులు రైతులు చేసిన ఆందోళనలు.. వారి త్యాగాలు అనిర్వచనీయం. మరి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరువాత అయినా వారి పరిస్థితులు చక్కబడ్డాయా అంటే అదీ లేదు. ఎంతవరకూ పక్క రాష్ట్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. వారితో వాదనలు.. వితండవాదాలు చేయడం ఇదే సరిపోయింది కాని రైతుల సమస్యలు ఏంటి వారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని ఆలోచించే ధోరణి ఏ ఒక్క నాయకుడికి పట్టడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో హామీలు చేస్తారు కాని గెలిచిన తరువాత మాత్రం వారిని పట్టించుకునే నాదుడే లేడు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. బంగారు తెలంగాణని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు కాని.. అసలు రాష్ట్రంలో ఉన్నరైతుల సమస్యలే పట్టించుకోని నాయకులు ఇక బంగారు తెలంగాణ ఎలా తయారు చేస్తారు అని గుసగుసలాడుకునే వారు కూడా ఉన్నారు. ఒక్క రాష్ట్రాన్నే అభివృద్ధి చేస్తే చాలదు.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు. తన ఫామ్ హౌస్ లో పండే పంటలు కూరగాయలు మంచిగా పండితే చాలదు.. రాష్ట్రంలో ఉన్న రైతల పంటలు కూడా అదే విధంగా పండేలా చూడాలి. ఇకనైనా  తమ ఒంటెద్దు పోకడని మాని రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోసి రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.