విద్యుత్ ఉద్యోగులపై కమిటీ.. పేర్లు మీరే చెప్పండి.. హైకోర్టు

 

తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రీలివింగ్ చేసిన వ్యవహారంపై ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఈ సమస్య పరిష్కారం చూడకుండా ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వాదనలకు చిరాకు పుట్టి హైకోర్టు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమస్యపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరిస్తారా సరే లేదంటే మేమే రంగంలోకి దిగాల్సి వస్తుంది అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు హైకోర్టు మరో మెట్టు ఎక్కి ఈ వ్యవహారంపై ఒక కమిటీని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని చెప్పినా రెండు రాష్ట్రాలు ఈ విషయంలో తిట్టుకుంటూ వ్యవహారాన్ని నాన్చుతున్నాయే తప్ప సమస్యను పరిష్కరించడంలేదని.. అందుకే తామే ఒక కమిటీ వేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఏ.శంకరనారాయణలు తెలిపారు. ఈ కమిటీ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు పేర్లను సూచించాలని.. ఈ కమిటీ ఛైర్మన్ గా ఒక వ్యక్తిని నియమిస్తామని.. అవసరమైతే రెండు రాష్ట్రాలకు సంబంధంలేని వ్యక్తిని కమిటీ ఛైర్మన్ నియమించాలని యోచిస్తున్నామని చెప్పారు. కనీసం ఈ కమీటీ ద్వారా అయినా  ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.