ఏడిద నాగేశ్వరరావు జీవిత విశేషాలు

 

ప్రముఖ నిర్మాత, పూర్ణోదయ పతాకం మీద ‘శంకరాభరణం’ లాంటి అనేక ఉత్తమ సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలివి... ఏడిద నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 24, ఏప్రిల్ 1934వ సంవత్సరంలో జన్మించారు. ఏడిద పాప లక్ష్మి, సత్తిరాజు నాయుడు ఆయన తల్లిదండ్రులు. ఆయన కాకినాడలో 10వ తరగతి, విజయనగరంలో ఇంటర్మీడియట్, కాకినాడలో బి.ఎ. చదివారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. నటుడిగా ఆయన తొలి చిత్రం ‘ఆత్మబంధువు’. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తొలి చిత్రం ‘పార్వతీ కళ్యాణం’. ఆత్మబంధువు, ఆస్తులు - అంతస్తులు, రణభేరి, పసిడి మనసులు, పవిత్రబంధం, నేరము - శిక్ష, బాలభారతం, కాదల్ ఓవియం (తమిళం), ఆరాధ, సంగీత లక్ష్మి, అత్తగారు - కొత్తకోడలు, పెళ్ళిరోజు తదితర చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపు వంద చిత్రాలకు పనిచేశారు. ‘తాయారమ్మ - బంగారయ్య’ నిర్మాతగా ఆయన తొలిచిత్రం. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి ఉత్తమ చిత్రాలను ఆయన నిర్మించారు. ఏడిద నాగేశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయన కుమారులు ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్ సినిమా రంగంలోనే వున్నారు.