రాత్రివేళ త్వరగా తింటే ఎంత లాభమో!

 

ప్రపంచం మారిపోయి ఉండవచ్చు. మనం జీవించే విధానమూ మారిపోయి ఉండవచ్చు. కానీ పెద్దలు చెప్పిన మంచి మాటలకి మాత్రం ఎప్పటికీ రోజులు చెల్లిపోవు. అందుకు ఉదాహరణగా రాత్రిపూట ఆహారం గురించి పెద్దలు చెప్పే మాటల గురించే చెప్పుకోవచ్చు. ‘రాత్రివేళ మనం తినే ఆహారం పడుకునే సమయానికల్లా అరిగిపోయేలా ఉండాల’న్నది పెద్దల మాట. అంటే కనీసం రాత్రి ఎనిమిదింటికల్లా తినేయాలన్నమాట. ఇదెంత ఆరోగ్యకరమో ఒక పరిశోధన రుజువుచేస్తోంది చూడండి!

 

పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు... ఆలస్యంగా ఆహారం తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి వారికి వేర్వేరు అలవాట్లను సూచించారు. మొదటి బృందంలో ఉన్నవాళ్లు ఉదయం ఎనిమిదిగంటల నుంచి రాత్రి ఏడుగంటల లోపు ఆహారం తీసుకోవాలని సూచించారు. రెండో బృందంలోని వారిని మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆహారం తీసుకోవచ్చని చెప్పారు. నిద్రపోయే సమయాలు మాత్రం, అభ్యర్థులందరికీ ఒకేలా ఉండేలా జాగ్రతత్తతీసుకున్నారు.

 

ఒక ఎనిమిదివారాలపాటు సాగిన ఈ పరిశోధనతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆహారం తినే సమయాన్ని బట్టి మన శరీరంలోని జీవక్రియలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించారు. ఆలస్యంగా తిన్నప్పుడు ఆహారంలోని కొవ్వు, శరీరానికి ఎక్కువగా అందుతున్నట్లు తేలింది. శరీరం పీల్చుకునే ఆక్సిజన్కంటే వదులుతున్న కార్బన్డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. శరీరంలోని ఈ ఆక్సిజన్, కార్బన్డైఆక్సైడ్ల మధ్య నిష్పత్తిని Respiratory quotient అంటారట. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, శరీరం హానికారక పదార్థాలనే ఎక్కువగా స్వీకరిస్తోందని అర్థం.

 

ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని భిన్నంగా స్వీకరిస్తోందని అర్థమైపోయింది. దీని వల్ల శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి, గుండె పనితీరు, కొవ్వు శాతం, గ్లూకోజు నిల్వలు... అన్నింటి మీదా ప్రతికూల ప్రభావం ఉన్నట్లు గమనించారు. అంతేకాదు! పగటివేళ ఆహారానికి అలవాటుపడితే, మనలో ఆకలిని కలిగించే ghrelin అనే హార్మోను కూడా పగటివేళే చురుగ్గా పనిచేస్తోందని తేలింది. అలాగే పొట్ట నిండుగా ఉండే భావనని కలిగించి, చిరుతిళ్లకు దూరంగా ఉంచే leptin అనే హార్మోను అదుపులో కనిపించింది.

 

ఒక్కమాటలో చెప్పాలంటే- రాత్రి ఆలస్యం కాకుండానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అధికబరువు వంటి సమస్యల నుంచి కూడా త్వరగా దూరం కావచ్చునని అంటున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంలో చాలా మార్పులు స్పష్టంగా వచ్చితీరతాయని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు.

- నిర్జర