దిల్లీ కాలుష్యం నుంచి పారిపోతున్నారు

 

ఎక్కడైనా చలికాలంలో పొగమంచు నగరాలను చుట్టుముడుతుంది. సూర్యుడిని చూడగానే మంచు కాస్తా కరిగిపోతుంది. కానీ దిల్లీవాసులను ఏకంగా పొగే చుట్టబెట్టింది. ఎన్ని రోజులు గడిచిన కరగకుండా వారిలో కన్నీటిని నింపుతోంది. ప్రపంచీకరణ తాలూకు కఠిన వాస్తవం ఇది. తప్పించుకోవాలనుకున్నా మార్గం కనిపించని పొగ ఇది. ఇంతకీ ఈ క్షోభ ఎందుకు? దీనికి కారణాలు ఏమిటి అని వెతకడం మొదలుపెడితే...

 

ఇదీ సమస్య

కాలుష్యం కారణంగా వాతావరణంలో పేరుకుపోయే ధూళికణాలను particulate matter (P.M) అంటారు. ఈ P.M కనుక 2.5 మైక్రోమీటర్లకంటే తక్కువగా ఉంటే అది నేరుగా మన ఊపిరితిత్తులలోకి చేరిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఒక క్యూబిక్‌ మీటరులో 25 P.Mకు మించి ఉంటే అది కాలుష్యం కిందకి లెక్కవేస్తారు. అలాంటి దిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఇది 900లకు పైగా నమోదైనట్లు చెబుతున్నారు.
ఇవీ కారణాలు

 

 

- తమ పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు పంటల అవశేషాలను తగటబెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అయితే ఇది పాక్షిక సత్యం మాత్రమే. దిల్లీలో ఉండే పరిశ్రమలు, వాహనాల వల్ల ఎప్పటికప్పుడు విపరీతంగా కాలుష్యం పేరుకొంటూ ఉంటుంది. అందుకనే వాహనాలు సరి-బేసి నెంబర్ల ఆధారంగా తిరగాలంటూ ఒక ప్రయోగాన్ని కూడా చేసి చూశారు. అయితే ఇంతకు మించి పటిష్టమైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.


 

 

- భవంతులు నిర్మించేటప్పుడు ఎక్కువ ధూళి పడకుండా, చెత్తను కాల్చకుండా దిల్లీలో చట్టాలు ఉన్నప్పటికీ ఏడాదికాలంగా వాటిని సరిగా అమలుచేయడం లేదని గణాంకాలు రుజువుచేస్తున్నాయి.

 

- దీపావళికి టపాసులను కాల్చడంలో కాస్త విచక్షణ పాటించమంటూ పౌరులను ఎంతగా వేడుకొన్నా దీపావళి టపాసుల ఆర్భాటంలో పెద్దగా మార్పులు రాలేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి.

 

- సాధారణంగా దీపావళి తరువాత కాలంలో దిల్లీలో ఒకటి రెండు వర్షాలు పడతాయి. ఈ వర్షాల వల్ల వాతావరణంలో పేరుకుపోయిన ధూళికణాలు కరిగి నేల మీదకు చేరుకుంటాయి. కానీ ఈసారి వరుణదేవుడు కరుణించనేలేదు. ఫలితంగా తక్కువ గాలి, ఎక్కువ తేమ ఉండే ఈ సమయంలో ధూళికణాలు అలాగే కదలకుండా ఉండిపోయాయి.
ఆరోగ్యం మీద తీవ్రప్రభావం

 

 

దిల్లీ కాలుష్యంలో జీవించడం అంటే ఇన్ని సిగిరెట్లు తాగినట్లు, అంత పొగను మింగినట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ కాలుష్యంతో ఏం జరుగుతుంది అంటే....

 

- ఈ ధూళి కణాలు మన ఊపిరితిత్తులలోకి చేరగానే అవి వాపుకి (inflammation) గురవుతాయి. అలా కొన్నాళ్లపాటు ఇవి మన ఊపిరితిత్తులలోకి పదే పదే ప్రవేశిస్తూ ఉంటే ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.

 

- ధూళి కణాలు కేవలం మన ఊపిరితిత్తులతోనే ఆగిపోవు. అవి నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా అవి మన రక్తనాళాలనీ, గుండెనీ దెబ్బతీస్తాయి. రక్తం ప్రవహించే వేగం, గుండె పనితీరు మందగించడం మొదలవుతుంది.

 

- శరీరంలోకి ప్రవేశించిన ధూళికణాలు మనలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. పైగా ఇందులో ఉండే హానికారక రసాయనాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఒక పక్క రోగనిరోధక శక్తి క్షీణించడం, మరోవైపు హానికారక రసాయనాలు... ఈ రెండింటి కారణంగా క్యాన్సర్‌ దాడి చేసే ప్రమాదం ఏర్పడుతుంది.

 

- చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు ఈ కాలుష్యం వల్ల త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.

 

- మోతాదు మించిన P.M కాలుష్యం మధ్య కాసేపు ఉన్నా... ఆ కాసేపు ధూళికణాలను పీల్చడం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, ఛాతీలో మంట వంటి నానారకాల సమస్యలూ తలెత్తుతాయి.

 

ఇన్ని మాటలు ఎందుకు! ఒక్కమాటలో చెప్పాలంటే ఒక 300 పరిమితిని దాటిన P.M కాలుష్యం మధ్య తిరగడం అంటే మృత్యువు వైపుగా అడుగులు వేసినట్లే! అందుకే ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం దీనిని నివారించడం ఎలాగా అని తలబాదుకుంటోంది. పవర్‌ ప్లాంటులను మూసేయడం దగ్గర్నుంచీ కృత్రిమ వర్షాలను కురిపించడం వరకూ అన్ని ఉపాయాలనూ పరిశీలిస్తోంది. ఈలోగా దిల్లీ పౌరులు మాస్కులు ధరించడం, ఎయిర్‌ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇక పొట్ట చేత పట్టుకుని రాజధానికి వచ్చినవారు ఈ కాలుష్యాన్ని భరించలేక తమ కుటుంబాలను ఊళ్లకు పంపిస్తున్నారు. మరికొందరు విహారయాత్రల పేరుతో కాలుష్యం నుంచి పారిపోతున్నారు. ఈ దెబ్బతో అయిన కాలుష్యం గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనీ, దిల్లీ ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలనీ కోరుకుందాం. అన్నింటికీ మించి మన హైదరాబాదు, విజయవాడ వంటి రాజధానులు దిల్లీ నుంచి తగిన పాఠాలు నేర్చుకుంటాయని ఆశిద్దాం.

 

- నిర్జర.