టీవీ చూస్తూ తింటే అనారోగ్యమే

 


భోజనం చేసేటప్పుడు టీవీ చూడకూడదనీ, అసలు టీవీ చూస్తూ తినే కార్యక్రమాన్ని పెట్టుకోవద్దనీ నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కుటుంబం అంతా టీవీ చుట్టూ చేరి భోజనాలు చేసే పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అలాంటివారికి హెచ్చరికగా ఇప్పుడు మరో పరిశోధన వెలువడింది...

 

భోజనాలని రికార్డు చేశారు

టీవీ చూస్తూ తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు మినసొటా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకుల ప్రయత్నించారు. ఇందులో భాగంగా 6-12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న ఓ 120 కుటుంబాలని ఎన్నుకొన్నారు. వీరి ఇళ్లలో భోజనాలు జరిగిన తీరుని రికార్డు చేసి అందించమన్నారు.

- ఈ 120 కుటుంబాలలో మూడోవంతుమంది భోజనం సమయంలో అసలు టీవీ జోలికి పోలేదు.

- నాలుగో వంతు మంది రోజులో ఒక్కసారి మాత్రమే భోజన సమయంలో టీవీ చూస్తూ గడిపారు.

- 43 శాతం మంది మాత్రం రెండుపూటలా టీవీ చూస్తూనే భోజనం చేశారు.

- టీవీ చూస్తూ తినే కుటుంబాలలో మూడో వంతు మంది టీవీ మోగుతున్నా దానిని గమనించకుండానే భోజనం పూర్తిచేశారు.

 

ఇవీ ఫలితాలు

ఇంట్లో టీవీ మోగకుండా భోజనం చేసినవారు ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు తేలింది. టీవీ వంక చూసినా చూడకపోయినా, అది వెనకాల మోగుతూ ఉన్న ఇళ్లలో తగినంత ఆహారాన్ని తీసుకోవడం లేదని తేలింది. టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్న కుటుంబాలలోని ఆహారంలో కూడా తేడా ఉన్నట్లు గమనించారు. వారి భోజనంలో పండ్లు, కూరలకంటే చిరుతిళ్లే అధికంగా కనిపించాయి. ఫలితంగా ‘టీవీ భోజనం’ అనే కార్యక్రమం సాగించే కుటుంబాలలోని పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది.

 

కారణాలు ఉన్నాయి

టీవీ చూస్తూ భోజనం చేయడానికి, పిల్లల్లో ఊబకాయానికీ సంబంధం ఏమిటి? అనిపించవచ్చు. టీవీ ధ్యాసలో పడితే ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అన్న విచక్షణ ఉండదు. ముఖ్యంగా ఇంకా ఆహారపు అలవాట్ల మీద పట్టు లేని పిల్లలకి దగ్గర ఉండి తగిన సూచనలు అందిస్తూ ఉండాల్సింది పోయి... చిన్నా,పెద్దా టీవీ ధ్యాసలో పడిపోతే అనర్థం తప్పదంటున్నారు. పైగా ఎలాగొలా టీవీ ముందుకి చేరిపోవాలన్న ధ్యాసలో పెద్దవారు కూడా వంట కారక్రమాల జోలికి పోకుండా, బయట నుంచి ఏదో ఒక ఆహారాన్ని తీసుకువస్తున్నట్లు తేలింది. ఫలితంగా పిల్లాపెద్దా అన్న తేడా లేకుండా ఊబకాయం, అజీర్ణం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి.

 

ఇలా తినాలి

భోజనం అంటే ఏదో మొక్కుబడి కార్యక్రమం అన్న చులకన భావం ఉండబట్టే... ఆ సమయంలో కాలక్షేపం కోసం టీవీ చూస్తుంటాం. నిజానికి ఇంట్లోవారంతా కలిసి కూర్చునే ఒక సందర్భంగా భోజన కార్యక్రమం ఉండాలంటున్నారు. మంచీ చెడూ మాట్లాడుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడం, పిల్లల ఆహారపు అలవాట్లను గమనించడం వంటివి ప్రశాంతమైన వాతావరణంలోనే సాధ్యమవుతాయి. అలా కాని పక్షంలో ఏం తినాలి, ఏం తింటున్నాం అన్న విచక్షణ కూడా లేకుండా తిండి అనేది ఓ మొక్కుబడి కార్యక్రమంగా మిగిలిపోతుంది. అది కొన్నాళ్లకి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.

 

- నిర్జర.