సర్వే రిపోర్ట్... ఢిల్లీ ఎన్నికల్లో మళ్ళీ విజయ డంఖా మోగించనున్న కేజ్రీవాల్


 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే దేశ రాజధానిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వారిస్తుందనే విషయం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి ఆప్ ఘనవిజయం సాధిస్తుందని సర్వేలు జోష్యం చెబుతున్నాయి. కేజ్రీవాల్ మళ్లీ ఢిల్లీ కింగ్ అవుతారని సీవోటర్ ఐఎఎన్ఎస్ సర్వే తేల్చి చెప్పింది. సర్వే ప్రకారం ఆమాద్మీ పార్టీకి 59 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్ కు 3 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. 

జనవరి మొదటి వారంలో ఢిల్లీలో ప్రీపోల్ సర్వేను సీవోటర్ ఐఎఎన్ఎస్ నిర్వహించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఔటర్ ఢిల్లీలో ఆప్ కు 26 సీట్లు లభించే అవకాశముంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉదృతం చేశాయి. సీఎం కేజ్రీవాల్ మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 7 ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే బూత్ లెవల్ ప్రచారం నిర్వహించారు. కానీ ప్రీపోల్ సర్వే అంచనాలు మాత్రం ఆ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయి. జనవరి 14 న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది.

సర్వే ప్రకారం ఆప్ కు ఢిల్లీలో 53.3 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయి. బీజేపీకి 25.9 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని అంటున్నారు. ఢిల్లీ ఓటర్లు సీఎంగా కేజ్రీవాల్ నే మరోసారి కోరుకుంటున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. బిజెపి కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా తెలియలేదు, కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 3  సీట్లలో మాత్రమే గెలిచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అందుకే ప్రచారం బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు అమిత్ షా.