అందరూ ఆహ్వానితులే.... కుదిరినన్ని పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగనున్న కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల్లో తమతో కలిసే రాజకీయ పార్టీలను కలుపుకొని పోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది తెలంగాణ కాంగ్రెస్. సాధారణ ఎన్నికల్లో కంటే మున్సిపల్ ఎన్నికల్లోనే పొత్తులు ఎక్కువగా ఉపయోగపడతాయనే ఫీలింగ్ లో కాంగ్రెస్ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కులు సిపిఐ, సిపిఎం ,టిడిపి ముఖ్య నాయకులకు ఫోన్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకటరెడ్డితో కుంతియా భట్టి ఫోనులో మాట్లాడటమే కాక మునిసిపల్ ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ప్రతిపాదించారు. సిపిఐ ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మండల కమిటీలు జిల్లా కమిటీలకు అప్పగించింది. ఎవరితో కలిసి పని చేస్తే లాభమో వారితోనే కలిసి పని చేయాలని  సిపిఐ నిర్ణయించుకుంది. బిజెపితో కాకుండా ఏ పార్టీతో అయిన అవగాహన కుదుర్చుకోవచ్చని సీపీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వంతో మాట్లాడుకోవాలని సూచించారు సీపీఐ నేత చాడ. ఖమ్మంలో ఇప్పటికే సీపీఐ, టీఆర్ఎస్ మధ్య కొంత అవగాహన కుదిరింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఖరారు చేసుకోబోతున్నారు నేతలు.

కాంగ్రెస్ కి అనుకూలంగా పని చేయాలని మండల కమిటీలు అనుకుంటున్న నేపధ్యంలో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలని ఎదుర్కోవాలి అనుకుంటోంది సిపిఐ. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో ఎవరితో అవగాహన కుదుర్చుకోవాలన్నది స్థానిక నాయకత్వం చేతికి అప్పగించింది సిపిఐ. సిపిఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రంతో కూడా కాంగ్రెస్ నాయకులు ఫోన్ లో మాట్లాడారు. సిపిఎం ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా పని చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండేది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో తన నిబంధనలలో కొంత సడలింపు ఇచ్చింది. బీజేపీతో కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులను ఖరారు చేసుకోవచ్చని క్షేత్ర స్థాయిలో ఉన్న కమిటీకి సిపిఎం ఆదేశాలు జారీ చేసింది. స్థానికంగా ఉన్న నాయకత్వంతో కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను బట్టి కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయి.కాంగ్రెస్ నాయకులు స్థానిక నాయకత్వంతో అవగాహన కుదుర్చుకోవడమే మిగిలింది. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణతో కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల స్వతంత్రంగానే నిలబడాలని టిడిపి నిర్ణయించినట్టు స్పష్టం చేసింది. బలం లేని చోట అవసరాన్ని బట్టి అవగాహన కుదుర్చుకోవడానికి టిడిపి కొంత సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో అవగాహన అంతా స్థానిక నాయకత్వాలకే అప్పగించడంతో ఒక్కోచోట ఒక్కో పొత్తు కనిపించనుంది.సిపిఐ, సిపిఎంలు ఎవరితో కలిసి పని చేసే అంశాన్ని స్థానిక కమిటీలకు అప్పగించడంతో ఒక్కోచోట ఒక్కో పొత్తు జరగనుంది.