జగన్ తరపున రాయబారమా? లేక చిరు ప్రాధాన్యతపై కోపమా? మోహన్ బాబు అడుగులు ఎటువైపు?

 

మోహన్‌ బాబు, తన ఫ్యామిలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షాను కలవడంపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తమ విద్యాసంస్థల ఫంక్షన్‌కు రావాలని ఆహ్వానించేందుకే మోడీని కలిశామని మోహన్‌ బాబు చెబుతున్నా, అంతకుమించిన సంప్రదింపులేవో జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు, త్వరలో వైసీపీని వీడి, కమలం గూటికి చేరతారన్న ప్రచారం ఆరోజు నుంచే సాగుతోంది. అయితే, బీజేపీలోకి రావాలని మంచు ఫ్యామిలీని మోడీ ఆహ్వానించారా అన్న మీడియా ప్రశ్నకు, దానిపై తానిప్పుడే మాట్లాడను, అవన్నీ తర్వాత చెబుతానంటూ మోహన్ బాబు చేసిన దాటవేత వ్యాఖ్యలు కూడా, ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలకు బలమిస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వస్తే, ఏదో ఒక నామినేటెడ్‌ పదవి వస్తుందని మోహన్ బాబు ఆశించారు. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుంటే అది దక్కలేదు. ఆ తరువాత ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగింది. అయితే ఈ పదవిని మరో నటుడు విజయ్ చందర్‌కు ఇచ్చారు. దాంతో, సీఎం జగన్, మోహన్ బాబుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం మొదలైంది. అంతేకాదు, త్వరలో... వైసీపీకి దక్కబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో, తనకు ఒకటి వస్తుందని మోహన్‌ బాబు ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ నుంచి అలాంటి సానుకూల సంకేతాలేవీ రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చిరంజీవి క్లోజ్‌ కావడం, మోహన్‌ బాబుకు అస్సలు నచ్చడం లేదని అంటున్నారు. మెగాస్టార్ కు అంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. జగన్ మీటింగ్ తర్వాత సినీ పరిశ్రమలో చిరు యాక్టివ్‌ కావడం, దాసరిలా పెద్దన్న పాత్ర పోషించేందుకు పావులు కదపడం కూడా మోహన్‌ బాబుకు రుచించడం లేదంటున్నారు. అసలే సీఎం జగన్‌, తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, నామినేటెడ్‌ పోస్టు కూడా ఇవ్వడం లేదని రగిలిపోతున్న మోహన్‌ బాబుకు, ఈ పరిణామాలు రుచించడం లేదనే మాట వినిపిస్తోంది. అందుకే ప్రధాని మోడీని కలిసి, తనకు ప్రధాని ఇస్తున్న ఇంపార్టెన్స్‌ను చాటిచెప్పాలనుకున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ టూర్‌ అన్న చర్చ జరుగుతోంది.

జగన్ పై కోపముందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి పాలనపై మోహన్‌ బాబు ప్రశంసలు కురిపించడం వెనుక ట్విస్టు ఉందంటున్నారు. కేవలం... ప్రధాని, హోంమంత్రి దగ్గర తనకు పరపతి వుందని జగన్‌కు చెప్పడం ద్వారా, వైసీపీలో తనకు ప్రాధాన్యం పెంచుకోవడం, మోహన్‌ బాబు వ్యూహంలో భాగమన్న చర్చ జరుగుతోంది. అయితే, అదే సమయంలో జగన్ తరపున మోడీ, అమిత్ షాతో మోహన్ బాబు రాయబారం నడిపారనే మాటలు కూడా కూడా వినిపిస్తున్నాయి.

మొత్తానికి తన మాటలే కాదు చేతలు కూడా సంచలనమేనని, తన రూటే సెపరేటని చెప్పుకునే మోహన్‌ బాబు, కేంద్ర పెద్దలను కలిసి అనేక రకాల చర్చలకు తెరలేపారు. మరి మోడీని మంచు ఫ్యామిలీ కలవడంలో అర్థం, వైసీపీని వీడి బీజేపీలో చేరడమా....లేక, చిరంజీవికి జగన్‌ క్లోజ్‌ కావడం సహించలేక, తాను మోడీకీ దగ్గరవడమా అన్నది, ఎవరి ఆలోచనను బట్టి, వారు అంచనా వేసుకుంటున్నారు. మరి, మంచు ఫ్యామిలీ రూటేంటో, అడుగులు ఎటు పడతాయో చూడాలి.