తెలంగాణ సభకు పిలవలేదు,రాలేదు
posted on Jul 1, 2013 1:08PM

తెలంగాణ రాష్ట్ర సాధనకై నిజాం కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు నిర్వహించిన సభకు తనను ఆహ్వానించలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తనకు ఆహ్వానం రాకపోవడంతో సభకు హాజరుకాలేదని దానం నాగేందర్ తెలిపారు. ఈరోజు హైదరాబద్ కు వచ్చిన పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఆహ్వానం పలికేందుకు దానం నాగేందర్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై అదిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న తమకు అభ్యతరంలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడో సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. దిగ్విజయ్ సింగ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో దానం నాగేందర్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ విమానాశ్రయం నుండి నేరుగా రాష్ట్ర కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ చేరుకున్నారు.