హుదూద్ తుఫాన్.. ఉత్తరాంధ్ర దడ
posted on Oct 9, 2014 9:07AM

మరో పెను తుఫాను ఉత్తరాంధ్ర, ఒరిస్సా వైపు మహావేగంగా వస్తోంది. హుదూద్ అని పేరు పెట్టిన ఈ తుఫాను గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో చండ ప్రచండంగా దూసుకొస్తోంది. ఉత్తర అండమాన్‌లో మొదలైన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి అండమాన్ వద్ద తీరం దాటింది. ఆ తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఈ తుఫాను విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలోనూ.. ఒడిసాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింతగా బలపడి పెనుతుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాను 12వ తేదీ మధ్యాహ్నానికి ఏపీలోని విశాఖపట్నం ఒరిస్సాలోని గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌ను జారీచేసింది. శనివారం నుంచి ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.