ప్రజాస్వామ్యాన్ని ఎవరు ఖూనీ చేస్తున్నారు?

 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన నిన్న పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించేంతవరకు కూడా పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయబోమని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పడమే కాక దానిని అమలు చేసి చూపించింది కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన 25మంది ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభ నుండి ఐదురోజుల పాటు సస్పెండ్ చేసారు.

 

సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో గట్టిగా డ్డీ కొనలేకపోతోంది కనుకనే రాహుల్ గాంధీ ఆలోచనను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్లుంది. తద్వారా ప్రధాని మోడీకి తన తడాకా చూపించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుంది. కానీ ఈ విధంగా వ్యవహరిస్తూ దేశ ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతున్నాననే విషయం కాంగ్రెస్ పార్టీ కానీ, దానిని ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ గానీ గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ తన శక్తి ప్రదర్శన కోసం పార్లమెంటు సమావేశాలనే పణంగా పెట్టాలనుకోవడాన్ని ప్రజాస్వమ్యవాదులెవ్వరూ కూడా హర్షించలేరు. కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు మీడియాతో మాట్లాడుతూ తాము ప్రతిపక్ష పార్టీగా ‘ఎన్డీయే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం’ అందిస్తామని చెప్పారు. వారు సహకారం అందించకపోయినా పరువాలేదు కానీ  ఈవిధంగా పార్లమెంటుని స్తంభింపజేయకుండా ఉంటే చాలని ప్రజలు కోరుకొంటున్నారు.

 

లోక్ సభ నుండి తమను బహిష్కరించి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని సోనియా, రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులను, ఒక విదేశాంగ మంత్రిని రాజీనామా చేయాలని పట్టుబడుతూ పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుపడుతూ కాంగ్రెస్ పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమను సభ నుండి సస్పెండ్ చేసిందుకు ఎన్డీయేని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ కూడగట్టుకొని  మరింత రాద్ధాంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది.

 

కాంగ్రెస్ పార్టీని, వాటి విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయవలసి ఉందని దృడంగా నమ్మే రాహుల్ గాంధీ స్వయంగా ఇటువంటి నీచ రాజకీయాలతో పార్లమెంటు సమావేశాలని అడ్డుకోవడం చూస్తుంటే అతను కాంగ్రెస్ పార్టీని మార్చడం కాదు, కాంగ్రెస్ పార్టీయే అతనిని, ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసినట్లుంది. అందుకే ఇప్పుడు అతను కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటయిన మూస పద్దతులలోనే ముందుకు సాగుతున్నారు. కానీ ఆ మూసపద్దతుల కారణంగానే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పక్కనబెట్టారనే సంగతి కూడా ఆయన గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

కొన్ని రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అక్కడ భారత సైనిక దళాలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే, కేంద్రప్రభుత్వానికి అండగా నిలబడి పూర్తి సహకారం అందించాల్సిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సభలో నానా రాద్ధాంతం చేసాయి. ఈ రెండు సంఘటనలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యల పట్ల కానీ దేశభద్రత విషయంలో గానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. ఉండి ఉంటే పార్లమెంటులో ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేదే కాదని చెప్పవచ్చును.