రైల్వేలలో భద్రత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే!

 

నిన్న రాత్రి మధ్యప్రదేశ్ లో ఒకేచోట, ఒకేసమయంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలలో ఇప్పటి వరకు 31 మంది ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అనేక వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నది సమీపంలోగా గల ఒక కల్వర్టుపై ఈ రైళ్ళు ప్రయాణిస్తుండగా పట్టాలు తప్పాయి. మొదట ముంబై నుండి వారణాశి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మరికొద్ది నిమిషాలలోనే జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా సరిగ్గా అక్కడే పట్టాలు తప్పింది.

 

రైల్వే బోగీలు నదిలో పడిపోయాయని వార్తలు నిజం కాదని, కల్వర్టు వద్ద రెండు రైళ్ళు పట్టాలు తప్పి బోగీలు చెల్లా చెదురుగా పడిపోవడంతో కల్వర్టు క్రిందన ఉన్న నీళ్ళు బోగీలలోకి రావడంతో రైలు బోగీలు నదిలో పడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయని రైల్వే శాఖ చైర్మన్ ఏ.కె మిట్టల్ చెప్పారు. కానీ ఈ ఘోర ప్రమాదం జరగడానికి ఆయన చెప్పిన సంజాయిషీ చాలా హాస్యాస్పదంగా ఉంది. కామయాని ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికాక ముందు 10 నిమిషాల వరకు కల్వర్టు మీద ఉన్న రైల్వే ట్రాక్ బాగానే ఉంది. కానీ హటాత్తుగా మాచక్ నదికి వరద ఉదృతి పెరగడంతో నీళ్ళు ట్రాక్ మీదకు వచ్చి పట్టాల క్రింద ఉన్న మట్టి, కంకర అన్ని కొట్టుకుపోవడం చేతనే రైళ్ళు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అంటే స్థానిక రైల్వే సిబ్బంది తప్పిదం లేదని చెపుతున్నట్లుంది.

 

కానీ మాచక్ నది చాలా ఉదృతంగా ప్రవహిస్తోందని తెలిసి ఉన్నప్పుడు దానిపై ఉన్న కల్వర్టుని, పట్టాల పరిస్థితిని నిరంతరం గమనించాల్సిన బాధ్యత స్థానిక రైల్వే స్టాఫ్ మరియు అధికారులదే. జోరుగా వానలు కురుస్తున్నప్పుడు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ అదేమీ పట్టించుకోకుండా ఒకవైపు ఖిర్కియా స్టేషన్ నుండి అదే సమయంలో మరోవైపునున్న హర్దా స్టేషన్ నుండి ఒకేసారి రెండు రైళ్ళను అనుమతించారంటే రైల్వే సిబ్బంది, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్ధమవుతోంది. రైల్వే అధికారులు దీనిని ప్రకృతి విప్పత్తుగా చూపిస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమేనని చెప్పక తప్పదు. అదే ఆ రెండు స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉండి ఉంటే అసలు ఆ రైళ్ళను ముందుకు వెళ్లేందుకు అనుమతించేవారే కాదు.

 

ప్రమాదం జరిగిన తరువాత అనేక రైళ్ళను వేరే ఇతర మార్గాలలోకి మళ్ళించామని రైల్వే అధికారులు ప్రకటించారు. కానీ అదే నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే ఇంతమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేవారు కాదు కదా? ఇటువంటివి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖలో నిర్లక్ష్య వైఖరి విడనాడటం లేదు. ఇటువంటి ఘోర మానవ తప్పిదాలను అరికట్టడం రైల్వేశాఖ తన వల్ల కాదనుకొంటే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్నానయినా సమర్ధంగా ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తే ఇటువంటి ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చును. కానీ పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టే సమయంలో మాత్రమే ‘రైల్వేలలో భద్రత’ గురించి ఏవో కొన్ని మాటలు వినిపిస్తుంటాయి తప్ప అవి ఆచరణకు నోచుకోవడం లేదని ఇటువంటి ఘోర ప్రమాదాలు నిరూపిస్తుంటాయి. ఎన్నేళ్ళు గడిచినా ఇటువంటి ఘోర ప్రమాదాలను, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ వద్ద మనుషులు, జంతువులు ప్రాణాలు కోల్పోవడం, రైళ్ళలో దొంగతనాలను అరికట్టలేకపోతున్నారు.

 

రైల్వేశాఖ ఆధునీకీకరణ పేరిట ప్రయాణికుల నుండి ప్రతీ ఏటా ముక్కుపిండి అదనపు చార్జీలు వసూలు చేస్తారు. కానీ ఇటువంటి ఘోర ప్రమాదాలను చూసినప్పుడు రైల్వేల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కనబడుతుంది. రైల్వేశాఖ బుల్లెట్ రైళ్ళ గురించి కలలుకనే బదులు ముందుగా ప్రయాణికుల భద్రతపై, పట్టాలపై దృష్టి పెడితే బాగుంటుంది. లేకుంటే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుంటుంది.