ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం... కార్మికులకు షాకిచ్చిన కేసీఆర్

షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన కరువైంది. ఆర్టీసీపై ఐదారు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడున్నట్లు యథాతథంగా సంస్థను నడపలేమని తేల్చిచెప్పేశారు. ఆర్టీసీని 5వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న కేసీఆర్... తక్షణం 2వేలకోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఒక్క సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటేనే 240 కోట్లు కావాలని, అలాగే సీసీఎస్ కు 500కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

ఇప్పుడున్నట్లుగా ఆర్టీసీని నడపాలంటే నెలకు 640కోట్లు కావాలన్నారు. ఇక పీఎఫ్ బకాయిలు నెలకు 70కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, అలాగే, వందల కోట్ల మేర డీజిల్‌ అండ్ రవాణా పన్ను బకాయిలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. మరోవైపు 2వేల 600 కాలం చెల్లిన బస్సులను తప్పనిసరిగా మార్చాల్సి ఉందని... ఈ భారమంతా ఇప్పుడు ఎవరు భరించాలని కేసీఆర్ ప్రశ్నించారు. అయితే, ఆర్ధిక మాంద్యం కారణంగా ఆర్టీసీ భారాన్ని భరించే శక్తి  ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని, అయితే, ఛార్జీలు పెంచితే జనం బస్సులెక్కరని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంతోకొంత ప్రభుత్వం సహాయం చేసినా ఆర్టీసీ ఎంతవరకు నెట్టుకురాగలుగుతుందోనన్న సందేహాన్ని కేసీఆర్ వ్యక్తంచేశారు. అయితే, వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే లక్ష్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.