ప్యాలెస్ లోనే సీఎం.. ప్రాబ్లమ్స్ లో జనం.. చంద్రబాబు ఉంటేనా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఏమైంది? ఈ క‌రోనా క‌ల్లోలం ఏంటి? ఒక్క‌రోజులో దాదాపు 10వేల కేసులు రావ‌డ‌మేంటి? ఆక్సిజ‌న్ కొర‌త‌తో ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డ‌మేంటి? బెడ్స్ లేక బెజ‌వాడ‌, ఒంగోలు ఆసుప‌త్రుల్లో ఆ దారుణ ప‌రిస్థితులేంటి? ఆఖ‌రికి కొవిడ్ ప‌రీక్షా ఫ‌లితాలు అంత ఆల‌స్యంగా ఇవ్వ‌డ‌మేంటి? ఏంటి? ఇదంతా ఏంటి? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ అరాచ‌క‌మేంటి? ఇది ఎవ‌రి వైఫ‌ల్యం? ఇంకెవ‌రి నిర్ల‌క్ష్యం? త‌ప్పంతా ప్ర‌జ‌ల‌దా? లేక‌, ఈ పాపం పాల‌కులదా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. ఇవి ప్ర‌శ్న‌లు మాత్ర‌మే కావు. ప్ర‌జ‌ల ఆక్రంద‌న‌. రోగుల క‌న్నీటి మంట‌.

ఏపీకి యువ ముఖ్య‌మంత్రి ఉన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న చేసిన సుదీర్ఘ పాద‌యాత్రం చూసి.. యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ అనుకున్నారు. అధికారం కోస‌మే అప్పుడాయ‌న అంత యాక్టివ్‌గా ఉన్నార‌ని.. ఒక‌సారి అంద‌లమెక్కాక‌.. ఇక మొద్దు నిద్ర‌లోకి జారుకున్నార‌ని ఎప్పుడో తెలిసొచ్చింది. ప్ర‌స్తుత కొవిడ్ స‌మ‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. ఓవైపు ఏపీ ప్ర‌జ‌లు క‌రోనాతో పిట్ట‌ల్లా రాలిపోతున్నా.. ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ లేక చ‌నిపోతున్నా.. అస‌లు హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ దొర‌క్క న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నా.. మ‌న ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. తాడేప‌ల్లిలోని ప్యాల‌స్ వీడి.. కొవిడ్ కోసం క‌దలి రావ‌డం లేదు. ఎంత చేత‌గాని త‌నం? ఎంత చేవ‌లేని ప్ర‌భుత్వం? అంటున్నారు ప్ర‌జ‌లు. 

మొక్కుబ‌డిగా కొవిడ్ స‌మీక్ష మిన‌హా.. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంపై గ‌ట్టిగా మ‌న‌సు పెట్టి ప్ర‌య‌త్నించింది లేదు. ప‌క్క రాష్ట్రం ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.. 74 ఏళ్ల వ‌య‌సులోనూ చ‌లాకీగా పని చేస్తున్నారు. తాజాగా, భువ‌నేశ్వ‌ర్‌లోని ఆసుప‌త్రిలో ఆక‌స్మిక త‌నిఖీ నిర్వ‌హించారు. కొవిడ్ ప‌రిస్థితిని స‌మీక్షించారు. స్వ‌యంగా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌కే హాస్పిట‌ల్‌కు త‌ర‌లిరావ‌డంతో అంతా అల‌ర్ట్ అయ్యారు. ముఖ్య‌మంత్రి ఎప్పుడు ఏ ఆసుప‌త్రిని త‌నిఖీ చేస్తారోన‌నే భ‌యంతో వైద్య సిబ్బంది అంతా మ‌రింత చిత్త‌శుద్ధిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అటు, క‌ర్నాట‌క సీఎం యడ్యూర‌ప్ప సైతం 78 ఏళ్ల వ‌య‌సులో ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు. త‌న‌కు క‌రోనా సోకినా వెర‌వ‌లేదు. ఆయ‌న కూడా ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసి.. సిబ్బందికి కొవిడ్ చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు ఇచ్చారు. 

ఇలా వ‌య‌సు పైబ‌డిన ముఖ్య‌మంత్రులే క‌రోనాపై క‌ద‌న‌రంగంలోకి దిగితే.. మ‌న ఏపీ ముఖ్య‌మంత్రివ‌ర్యులు మాత్రం ఇంత వ‌ర‌కూ ఒక్క ఆసుప‌త్రినైనా సంద‌ర్శించ‌లేదు. కొవిడ్ చికిత్స లోటుపాట్ల‌ను ప‌రిశీలించ‌లేదు. రోగుల‌కు ధైర్యం చెప్ప‌లేదు. జ‌గ‌న్‌రెడ్డికి పేటెంట్ అయిన‌.. ఓదార్పు యాత్ర చేప‌ట్ట‌లేదు. విజ‌య‌వాడ‌, ఒంగోలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల కోసం రోగులు రోజుల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నా.. ఆఖ‌రికి శ‌వ‌ద‌హ‌నానికీ ఇబ్బందులు ఎదుర‌వుతున్నా.. ప‌ట్టించుకోవ‌డం లేదు. విజ‌య‌న‌గ‌రం మ‌హారాజా ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌తో రోగులు చ‌నిపోయినా.. త‌గు చ‌ర్య‌లు లేవు. ఇంత ఉదాసీన ముఖ్య‌మంత్రి గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేదు ఏపీ ప్ర‌జ‌లు అని వాపోతున్నారు. 

సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్‌ను వ‌దిలి ప్ర‌జాక్షేత్రంలోకి వ‌స్తే.. వాస్త‌వ‌ ప‌రిస్థితులు తెలుస్తాయి. యంత్రాంగంలో బాధ్య‌త పెరుగుతుంది. తిరుప‌తిలో ఉప ఎన్నిక ఉంటే.. ప్ర‌చారానికి సిద్ధ‌మైన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం ఆంధ్ర రాష్ట్ర‌మంతా కొవిడ్‌తో అల్లాడిపోతుంటే మాత్రం క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు పూనుకోవ‌డం లేదు. కొవిడ్ ప‌రీక్ష‌లో ఆల‌స్యాన్ని నివారించ‌డం లేదు. ఆక్సిజ‌న్ కొర‌త‌ను తీర్చ‌డం లేదు. హాస్పిట‌ల్‌లో బెడ్స్ లేక రోగులు అవ‌స్థ‌లు ప‌డుతుంటే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కరోనా కోర‌ల్లో చిక్కుకుపోయి ఇంత‌గా అల్లాడిపోతుంటే.. మ‌రీ, ఇంత నిర్ల‌క్ష్య‌మా? మ‌రీ, ఇంత లెక్క‌లేని త‌న‌మా? అని అడుగుతున్నారు ప్ర‌జ‌లు. 

ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఆ త‌ర్వాత న‌మ్మి మోస‌పోయామ‌ని గ్ర‌హించారు. అందుకు ఫ‌లితం రెండేళ్లుగా అనుభ‌విస్తున్నారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో తాము చేసిన త‌ప్పునకు పెద్ద శిక్షే అనుభ‌విస్తున్నారు. ఏపీలో కొవిడ్ కేసులు విజృంభిస్తున్నా.. స‌ర్కారులో ఉలుకూప‌లుకు లేదు. ముఖ్య‌మంత్రి నుంచి స‌రైన చ‌ర్య‌లు లేవు. మ‌రో తెలుగురాష్ట్రం తెలంగాణకంటే ఆల‌స్యంగా లాక్‌డౌన్ పెట్టారు. మొన్న‌టి వ‌ర‌కూ స్కూల్స్‌ తెరిచే ఉంచారు. రేపోమాపో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పెట్టేందుకూ సిద్ధ‌మ‌వుతున్నారు. దేశ‌మంతా ఎగ్జామ్స్ ర‌ద్దు చేస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి మాత్రం ఏం ఉద్ద‌రిద్దామ‌నో గానీ ప‌రీక్ష‌ల‌పై పంతానికి పోతున్నాడు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నాడు. పాపం.. నారా లోకేశ్‌.. రోజూ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ప‌రీక్షలు వ‌ద్దంటూ సీఎంను అడుగుతూనే ఉన్నాడు. ఇదేమి తుగ్ల‌క్ చ‌ర్య‌లంటూ నిల‌దీస్తూనే ఉన్నాడు. గ‌వ‌ర్న‌ర్‌కు సైతం లెట‌ర్ రాశాడు. అయినా.. స‌ర్కారుకు తెలిసి రావ‌డం లేదు. ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు పెట్ట‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో జ‌గ‌న్‌రెడ్డికి అర్థం కావ‌డం లేదు. మ‌రో నీరో చ‌క్ర‌వ‌ర్తి క‌దా మ‌న ముఖ్య‌మంత్రి.. అనుకుంటున్నారు ప్ర‌జ‌లు. అప్పుడు ఆయ‌న‌కు ఎందుకు ఓటేశామా అని ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 

గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో జ‌గ‌న్‌ను పోల్చి చూసుకొని బాధ‌ప‌డుతున్నారు జ‌నాలు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండి ఉంటేనా.. అంటూ ఆయ‌న ప‌నితీరును గుర్తు చేసుకుంటున్నారు. సీఎం చంద్ర‌బాబు డ్యాష్ బోర్డులో.. ఏపీ కొవిడ్ సిట్యూయేష‌న్ మొత్తం నిక్షిప్తం అయి ఉండేది. ఎక్క‌డ ఏ హాస్పిట‌ల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి.. ఏ జిల్లాలో ఎంత మంది పేషెంట్స్‌కి బెడ్స్ అవ‌స‌రం.. ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఎన్ని కిట్స్ అద‌నంగా ఉన్నాయి.. ఎక్క‌డ ఆక్సిజ‌న్ అవ‌స‌రం.. అద‌న‌పు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి.. ఇలా నిత్యం.. ఆప‌రేష‌న్ కొవిడ్ నిర్వ‌హిస్తూ  ఉండేవారు చంద్ర‌బాబు. అధికారుల‌ను, వైద్య సిబ్బందిని ఉరుకులు ప‌రుగులు పెట్టించే వారు. తాను నిద్ర పోకుండా.. ఆఫీస‌ర్ల‌ను నిద్ర‌పోనీకుండా.. రాష్ట్రంలో అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే వర‌కు విశ్ర‌మించ‌క‌పోయేవారు చంద్ర‌బాబు. అలాంటి వ‌ర్క్ హాలిక్ చంద్ర‌బాబును కాద‌ని, జ‌గ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నందుకు ఇప్పుడీ అవ‌స్థ‌లు అంటున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు. కొవిడ్ క‌ల్లోల ప‌రిస్థితి మ‌రింత దిగ‌జార‌క ముందే.. జ‌గ‌న్‌రెడ్డి.. రాజ‌ప్ర‌సాదం వీడి.. వీధుల్లోకి వ‌స్తేనే.. అధికారులు, వైద్య సిబ్బందిలో బాధ్య‌త పెరిగేది.. కొవిడ్ క‌ష్టాల నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగేది. మ‌రి, జగ‌న్‌రెడ్డి వ‌స్తాడా?ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తాడా? 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu