మోడీ నోట మళ్లీ పాత పాటే..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వననని బీజేపీ పార్లమెంట్ సాక్షిగా తెగేసి చెప్పిన పక్షంలో..నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకహోదాపై కేంద్రంతో చర్చించి, క్లారిటీ తీసుకొస్తారు..దీని కోసం బీభత్సమైన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ప్రేపేర్ చేస్తున్నారంటూ పెద్ద హంగామా చేసింది మీడియా. తీరా సస్పెన్స్ ముగిసింది..సీఎం ఢిల్లీ వెళ్లారు, ప్రధానితో భేటీ అయ్యారు. అంతే ఎప్పటి లాగానే విభజన హామీలు నెరవేరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీడియాతో చెప్పారు.

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరువు, అభివృద్ధి ప్యాకేజీలు తదితర అంశాలపై ప్రధానితో చర్చించేందుకు సీఎం తన బృందంతో నిన్న ప్రధాని కలిశారు. 20 నిమిషాల పాటు సీఎం, ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రెవెన్యూ లోటు భర్తీ, తదితర అంశాల గురించి ప్రస్తావించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేయాల్సిన 12 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. 2019-20 నాటికి 14వ ఆర్ధిక సంఘం కాలవ్యవధి పూర్తయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ లోటు ఉంటుందని బాబు చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా పోటీ పడేలా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌పై 2014, ఏప్రిల్ 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1,472 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి, ప్రధానిని కోరారు. ఈ ప్రాజెక్ట్ ‌2018 నాటకి పూర్తి అవ్వడానికి అవసరమైన నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతరాత్ర అవసరమైన మౌలిక సదుపాయాలకు మరో మూడేళ్ల పాటు రూ.10వేల కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి నుంచి ఆర్ధిక సాయం చేయాలని కోరారు. పదేళ్ల పాటు మూలధన రాయితీ 30 శాతం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఆదాయపుపన్ను, సేవా పన్ను నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో సమానంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. వీటితో పాటు రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి వచ్చే ఎనిమిదేళ్ల పాటు జిల్లాకు ఏడాదికి రూ.200 కోట్ల చొప్పున ఆర్ధిక సాయం, పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, షెడ్యూల్‌ 13లోని మౌలిక సదుపాయాలు, ఆర్ధిక చర్యల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విన్నవించారు.

 

అభివృద్ధి కోసమే మీతో పొత్తు పెట్టుకున్నాం. సీమాంధ్రులకు ఇష్టం లేకున్నా విభజన జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోలేదు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగేదాకా కేంద్రం చేయూతనివ్వాలి. ఎన్నికల సమయంలో బిడ్డను బతికించి తల్లిని చంపారని మీరే స్వయంగా వ్యాఖ్యానించారు. మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. అంటూ సీఎం కాస్త సూటిగానే ప్రశ్నించారు. సీఎం ఆవేదనను విన్న ప్రధాని ఎప్పటిలాగానే నేనున్నా.. అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇలా చంద్రబాబు, మోడీని 20 సార్లకు పైగా కలిశారు. ఎన్నోసార్లు రాష్ట్ర పరిస్ధితిని ఏకరువు పెట్టారు. మోడీకి ఇవ్వడం ఇష్టం లేనప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఉపయోగం లేదన్నది ఇక్కడ సుస్పష్టం. మొత్తానికి వారం రోజుల పాటు సాగిన సస్పెన్స్‌కు ప్రధాని తన స్టైల్లో తెరదించారు.