తలచినదే జరిగిందీ

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఎన్నికల ఫలితాలు ఒక కొలిక్కి వచ్చాయి. అనుకున్న ఫలితాలనే ఇవి అందించినప్పటికీ ఓటరు నాడి విస్పష్టంగా వెల్లడి కావడం అనూహ్యమైన విషయం. తమిళనాడు! ఎన్నికలు ముగిసిన వెంటనే తాజావార్తగా నిలిచిన అంశం, తమిళనాట జయ ఓడిపోనుందన్న అనుమానం. తమిళనాట ఓటర్లు మార్చిమార్చి ఫలితాలను అందించే అలవాటు ఉన్నవారు కావడంతో, అలవాటు ప్రకారం ఈసారి డీఎంకేకు అధికారం దక్కుతుందని అంతా ఊహించారు. ఇంచుమించుగా ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా డీఎంకేకు అనుకూలమైన సంకేతాలను అందించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు. కానీ దాదాపు 30 ఏళ్ల తరువాత అన్నాడీఎంకే, రెండోసారి వరుస విజయాన్ని సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది. అటు డీఎంకేను, ఇటు అన్నాడీఎంకేను ఓడించి తమిళ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తానని బీరాలు పలికిన కేప్టెన్‌ విజయ్‌కాంత్‌గారి ఓడ బయల్దేరకముందే మునిగిపోయింది. విజయ్‌కాంత్‌ తన పార్టీని నిలబెట్టుకోలేకపోగా, ఓట్లను చీల్చి పరోక్షంగా అన్నాడీఎంకే విజయానికి కారణంగా నిలిచారు.

 

అసోం! ఈ రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణం గెలవనుందన్న ఊహలు మొదటినుంచీ చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ఈశాన్య భారతం మీద బీజేపీకి పట్టులేకపోవడంతో, హంగ్‌ దిశగా ఓటర్లు సాగుతారనే అనుమానాలూ ఉన్నాయి. అందుకే భాజపా నేతలంతా ఈ ఎన్నికలలో తమ తురుపుముక్కయిన అసోం మీదే కన్నేశారు. మోదీ, అమిత్‌షా వంటి హేమాహేమీలంతా అసోం దారిపట్టారు. ఒక పక్క కేంద్రంలో ప్రభుత్వం నానారకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అవేవీ అసోం ప్రజల మీద ప్రభావం చూపకుండా ఉండేందుకు వారిని హామీలతో ముంచెత్తారు. ఫలితం 15 ఏళ్లుగా అసోంను ఏలుతున్న కాంగ్రెస్‌ కురువృద్ధుడు తరుణ్ గొగోయ్‌ తలవంచక పశ్చిమ బెంగాల్లో! ఇటు తమిళనాట జయలలిత పట్టు నిలుపుకున్నట్లే,

 

బెంగాల్‌ శక్తిమాత మమత అక్కడ తన ఉనికిని నిలబెట్టుకున్నారు. శారదా స్కాం మొదలుకొని నారదా స్కాం వరకూ మమత ప్రభుత్వం ఎన్ని కుంభకోణాలను ఎదుర్కొన్నా, ఆమెకు మరో అవకాశం ఇచ్చిచూడాలని నిర్ణయించుకున్నారు బెంగాలీ బాబులు. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుందనుకున్న అనుమానం మొదటి నుంచీ ఉన్నప్పటికీ, మూడింట రెండువంతులకు పైగా మెజారటీతో అధికారాన్ని అందుకునే దిశగా మమత సాగిపోవడం ఆశ్చర్యకరం. వామపక్షాలు, కాంగ్రెస్‌ కలిసి కూడా 294లో 100 సీట్లను మించి గెల్చుకునే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. మరి ఈ కరాఖండి విజయంతో మమత అక్కడ బలమైన సంస్కరణలు తీసుకువస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.

 

కేరళ! కేరళలో ఎలాంటి ఫలితం వస్తుందన్న అనుమానం ఎవరికీ లేదు. సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో మునిగిపోవడంతో ఓటర్లంతా వామపక్షాల వైపు మొగ్గుచూపసాగారు. దీనికి తోడు అగ్నిప్రమాదాల నుంచి అత్యాచార ఘటనల వరకు చాలా వార్తలు కేరళ ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచాయి. దాంతో వామపక్ష కూటమికి చెందిన 92 ఏళ్ల అచ్చుతానందన్ ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే భారతావనిలో అతి వృద్ధ ముఖ్యమంత్రిగా అచ్చుతానందన్‌ రికార్డుని సృష్టించవచ్చు. ఇక ‘మీ రాష్ట్రంలో సోమాలియా తరహా పేదరికం తాండవిస్తోందని’ మోదీ చేసిన వెక్కిరింపుకి నొచ్చుకున్న కేరళ సహోదరులు బీజేపీకి చుక్కలు చూపించారు. బీజేపీ తరఫున నిల్చొన్న శ్రీశాంత్‌కు మరోసారి ఏడుపొచ్చేలా విధి పావులు కదుపింది.

 

పుదుచ్చేరి! అసోం, కేరళలో అధికారాన్ని కోల్పోయి... బెంగాల్, తమిళనాట నిండా మునిగిపోయి ఉన్న కాంగ్రెస్‌కు పుదుచ్చేరి ఫలితాలు ఒక్కటే ఊరటని కలిగించనున్నాయి. ఇక్కడ డీఎంకేతో పాటుగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌, ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోనుంది. తమిళనాట అరుదైన అవకాశాన్ని పోగొట్టుకున్న కరుణానిధి, దేశంలో మరో ఇద్దరు ముఖ్యమంత్రులను చేజార్చుకున్న రాహుల్‌గాంధీలకు పుదుచ్చేరి సముద్రపు ఒడ్డే కాస్త సేద తీర్చనుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu