విశ్వ(నాథన్) చదరంగ ప్రేమికులకి ఇక ఆనందం మిస్?

 

ప్రపంచానికి భారతదేశం ఎన్నో ఆవిష్కరణల్ని అందించింది. సున్నా మొదలు యోగా వరకూ  అన్నీ ఇండియాలోనే పుట్టాయి. అలా భారతదేశంలో ఉపిరి పోసుకున్న ఊపిరిబిగబట్టి కూర్చునేలా చేసే ఇంటలిజెంట్ గేమ్… చెస్! చదరంగం మన దేశంలోనే పుట్టిందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక తెలిసిన కొద్దీ మందికీ చెస్ పట్ల నిజమైన అవగాహన వుండకపోవచ్చు. మరిక అంతర్జాతీయంగా పెద్ద పెద్ద టోర్నమెంట్లు గెలిచే భారతీయ చెస్ క్రీడాకారులకి మన దగ్గర లభించే గుర్తింపు గురించి చెప్పేదేముంది? ఇంగ్లాండులో పుట్టిన క్రికెట్ ఆడే కిక్రెట్ ప్లేయర్లకి దొరికిన దాంట్లో వందో వంతు కూడా మన దేశంలో పుట్టిన చదరంగం ఆడే వారికి లభించదు!

 

మన దేశంలో ఇంతగా చెస్ పట్ల నిర్లక్ష్యం ఎదురవుతున్నా… ఒక్క పేరు మాత్రం ఎంతో పాప్యులర్ అయింది. అసలు ఆయన పేరే… చెస్ ఆటకు మారు పేరు! అదే విశ్వనాథన్ ఆనంద్! విశ్వనాథన్ ఆనంద్ ఎన్ని మ్యాచ్ లు గెలిచాడు, ఎన్ని టోర్నమెంట్లు నెగ్గాడు, ఎన్నిసార్లు, ఎన్నియేళ్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు… ఇలాంటివి తెలియకున్నా… అందరికీ తెలిసింది మాత్రం అతనో గ్రాండ్ మాస్టరని! కాని, ఇంతకాలం భారతదేశానికి చదరంగ రంగంలో మకుటం లేని మహారాజులా వెలిగిపోయిన ఆనంద్ ఇప్పుడిక రిటైర్ అవుతారట!

 

ఇంకా కన్ ఫర్మ్ గా విశ్వానాథన్ ఆనంద్ చెప్పనప్పటికీ గత కొన్నేళ్లుగా ఆయన వరస అపజయాలు చవిచూస్తున్నారు. 2014లో ఆయన చివరి ఘనవిజయం నమోదు చేశారు. తరువాత నుంచీ దాదాపు అన్ని మ్యాచుల్లో ఘోర వైఫల్యం చవిచూస్తున్నారు. రష్యా, అమెరికా దేశాల గ్రాండ్ మాస్టర్లకి చుక్కలు చూపించిన ఆయన ఇప్పుడిలా డీలా పడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది! అంతే కాదు, విశ్వనాథన్ ఆనంద్ ఈ మధ్య తన ఆటతీరు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మతిలేకుండా ఆడుతున్నానని, అర్థం పర్థం లేకుండా ఆడుతున్నానని అన్నారు. ఇలా ఆడటం కంటే ఆడకోవటం బెటర్ అన్నారు. దీన్ని బట్టే ఆయన చెస్ బోర్డ్ కి ఇక గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి!

 

ఆరేళ్లప్పటి నుంచీ చదరంగం ఆడుతోన్న ఆనంద్ 1980ల నుంచీ దేశవ్యాప్తంగా చెస్ అభిమానుల దృష్టి ఆకర్షించారు. తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచంలో ఇండియాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన రిటైర్ మెంట్ ప్రకటించటం అభిమానులకి బాధ కలిగించే విషయమే. అయితే, భారత్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం విశ్వనాథన్ ఆనంద్ సేవల్ని గుర్తించి సత్కరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆయన ద్వారా ఈ తరం చెస్ ఛాంపియన్స్ కి మార్గదర్శనం చేయించటం కూడా ఎంతో అవసరం!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu