చార్మినార్ గడియారానికి కాల‘దోషం’

చార్ సౌ సాల్ షెహర్ అని చెప్పుకునే హైదరాబాద్ నగరానికి చార్మినార్   బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచింది.  చారిత్రక చార్మినార్‌లోని 135 ఏళ్ల నాటి గడియారం దెబ్బతింది. చార్మినార్‌కు మరమ్మతులు చేస్తుండగా ఓ ఇనుపరాడ్ గడియారానికి తగలడంతో 5, 6 నంబర్ మధ్య అద్దం కొద్దిగా పగిలింది. అయినప్పటికీ ఇంకా అది పనిచేస్తుండడం గమనార్హం. 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పు వైపున ఉన్న గడియారం ధ్వంసమైంది. 
చార్మినార్‌ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం  అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. అయితే చార్మినార్‌ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా పూర్తిగా తెలియరాలేదని చరిత్రకారులు చెబుతుంటారు. 
  ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని  పూర్వికులు చెబుతుంటారు.  అప్పట్లో  ప్లేగు అంతం కావడంతో  అల్లాకు నివాళిగా చార్మినార్‌ నిర్మించారు. చార్మినార్ కు ఉన్న  నాలుగు స్తంభాలు కూడా ఇస్లాం లోని  మొదటి నాలుగు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి.కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త ముహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని కూడా చెబుతారు, దీని రూపకల్పన షియా తజియాస్ ఆకారంలో ఉంది. చార్మినార్ ఉన్న ప్రదేశంలోనే  సుల్తాన్ తన కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు. 
17వ శతాబ్దంలో ఇక్కడ ప్రయాణించిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, జీన్ డి థెవెనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నమైనదని చెప్పొచ్చు. పర్షియన్ గ్రంథాలప్రకారం చార్మినార్ రెండవ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది.పునాది రాయిపై ఉన్న శాసనం ‘ఈ నా నగరాన్ని ప్రజలతో నింపండి, ఓ ప్రభూ, నదిని చేపలతో నింపండి’ అని అనువదించబడింది. చరిత్రకారుడు మహమ్మద్ సఫీయుల్లా ప్రకారం, చార్మినార్ హైదరాబాద్‌కు కేంద్రంగా నిర్మించబడింది. 1670లో పిడుగుపాటుకు గురై ఒక మినార్ కింద పడిపోయింది. అప్పుడు సుమారు రూ.58000 ఖర్చుతో మరమ్మతులు చేశారు. 1820లో, దానిలో కొంత భాగాన్ని సికందర్ జా  పునరుద్ధరించారు. చార్ మినార్ పై అంతస్తులో అత్యంత పురాతన  మసీదు ఉంది. 1889 సంవత్సరంలో చార్మినార్కు  నాలుగు వైపులా నాలుగు గడియారాలు కూడా అమర్చారు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి డ్యామేజ్ అయ్యింది.  గత కొన్ని రోజులుగా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్  మరమ్మత్తులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక  పొడవైన ఇనుప రాడ్ చార్మినార్ గడియారాన్ని తాకింది. దీంతో గడియారం అద్దం పగిలిపోయింది. అప్పట్లో  ఆగిపోయిన గడియారాలను వహీద్ వాచ్ కంపెనీ రిపేర్ చేసి పునరుద్దరించినప్పటికీ తాజాగా జరిగిన డ్యామేజి పట్ల హైదరాబాద్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu