కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద వందల మంది?
posted on Jul 30, 2024 10:22AM
కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో కొండ ప్రాంతాలలో జరిగిన ఈ ఘటనల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
మంగళవారం (జులై 30) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒకసారి, ఆ తరువాత కొండచరియలు విరిగిపడ్డాయి. 4 గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. విష యం తెలుసుకున్న అధికారులు, పోలీసులు కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఫైర్‌ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు19 ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అయితే వందల మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని స్థానికుల చెబుతున్నారు.
సంఘటనా స్థలంలో ఆరు వందల మంది ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమై ఉణ్నారు. సహాయక చర్యలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. ఇలా ఉండగా కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.