గౌర‌వ స‌భా? కౌర‌వ స‌భా? చంద్ర‌బాబు కంట‌త‌డి.. సీఎంగానే స‌భ‌కు వ‌స్తానంటూ శ‌ప‌థం..

ముఖ్య‌మంత్రిగానే మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగుపెడ‌తానంటూ చంద్ర‌బాబు స‌భ‌లోనే శ‌ప‌థం చేశారు. ఇది గౌర‌వ స‌భ‌నా.. కౌర‌వ స‌భ‌నా.. అంటూ మండిప‌డ్డారు. ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో తాను ఎన్నో అవ‌మానాలు ప‌డ్డాన‌ని.. ఇవాళ త‌న కుటుంబాన్ని, త‌న భార్య‌ను అవ‌హేళ‌న‌గా మాట్లాడ‌టం దుర్మార్గ‌మంటూ.. స‌భ‌ను బ‌హిష్క‌రించారు చంద్ర‌బాబు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను కించ‌ప‌రిచారంటూ ఒక ద‌శ‌లో కంట నీరు కూడా పెట్టారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వెకిలిగా న‌వ్వార‌ని తెలుస్తోంది. తీవ్ర ఆవేద‌నతో మ‌న‌స్తాపం చెందిన చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

ఉద‌యం నుంచీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జ‌ర‌గుతోంది. మంత్రులు కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడారు. ‘చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ సభ్యులు ‘చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వెంటనే కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ పట్టుబట్టింది.

నాని వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం సహా అన్ని విషయాలపై చర్చకు సిద్దమే’ అని బాబు సవాలే విసిరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మరో మంత్రి కన్నబాబు.. హెరిటేజ్ సంస్థ విషయం ప్రస్తావనకు తెచ్చారు. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని తట్టుకోలేరా..? అంటూ కన్నబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. చాలా సేపు ఇరు స‌భ్యుల మ‌ధ్య కౌంట‌ర్లు న‌డిచాయి. 

ఇక అంబటి రాంబాబు.. స‌భ‌లో మ‌రింత నీచంగా మాట్లాడారు. డ‌బుల్ మీనింగ్ వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబును అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఆయన భార్య‌పై సైతం నోరు పారేసుకున్నారు. కుటుంబంపైనా అనుచిత కామెంట్లు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 

‘‘పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు. ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి (మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’ అని చంద్రబాబు అసెంబ్లీలో శ‌ప‌థం చేసి స‌భ బ‌హిష్క‌రించి ఆవేద‌న‌తో, ఆగ్ర‌హంతో బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.