తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏపీలో ప్రతిష్టిస్తాం: చంద్రబాబు

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్ బండ్ మీద వున్న తెలుగు మహనీయుల విగ్రహాలను పీకేసీ లారీలో వేసి ఆంధ్రప్రదేశ్‌కి పంపుతానని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వ్యాఖ్యలకు మంచి సమాధానం చెప్పారు. తెలుగుజాతి గర్వించదగ్గ తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టిస్తామని అన్నారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగిస్తానని కేసీఆర్ అనడం సమంజసంగా లేదని చెప్పారు. మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు.

 

* రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి వుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణ మాఫీ చేసి తీరుతాం.

 

* నాదెళ్ళ సత్యకి ఆంధ్రప్రదేశ్ విధానాలు బాగా నచ్చాయి.

 

* ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ మీడియాకీ మేం అభ్యంతరం తెలుపలేదు.

 

* రాజకీయ పార్టీలకు పేపర్లు, టీవీలు వుండటం సబబు కాదు.

 

* పార్టీల కోసం అవినీతి సొమ్ముతో పేపర్లు, టీవీలు పెట్టడమేమిటి? అలా పెట్టినా ఎంత దుష్ప్రచారం చేసినా ఎన్నికలలో గెలవలేకపోయారు.

 

* ఆంధ్ర ప్రదేశ్‌కి ఏ పరిశ్రమ వచ్చినా మేం సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తాం.

 

* కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నేను స్పందించను.

 

* తెలంగాణలో అన్ని సమస్యలకూ నేనే కారణం అని చెప్పడం సరికాదు. ఎరువుల సమస్యకు కూడా నేనే కారణమా? ప్రజలు మాటలను నమ్మరు.. చేతలను నమ్ముతారు.