ప్రభువే కాపాడును నన్ను: అనిల్

 

తనపై క్రమంగా ఉదృతమవుతున్న బీజేపీ దాడులకు బ్రదర్ అనిల్ కుమార్ మొట్టమొదటిసారి స్పందిస్తూ తానూ ఏపాపము చేయలేదని, తన స్నేహితుడికి చెందిన సంస్థలో ఎవరో వ్యక్తీ చనిపోయినా కూడా అది తనకే ముడిపెట్టి తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మహాపురుషుడయిన రాజశేఖర్ రెడ్డి కుటుంబములో సభ్యుడినయినందుకు తానూ చాలా గర్వ పడుతున్నానని, తమ కుటుంబములో ఎవరూ కూడా తప్పులు చేయలేదని అన్నారు. దైవసేవలో నిమగ్నమయి ఉన్న తనపై ఈ విధంగా లేనిపోని అభాండాలు వేయడం చాలా అన్యాయమని, తనను ఆ ప్రభువే కాపాడుకొంటాడని అనిల్ అన్నారు.

 

కానీ, బీజేపీ మాత్రం బ్రదర్ అనిల్ కుమార్ కి వ్యతిరేఖంగా తన వద్ద ఖచ్చితమయిన ఆధారాలున్నాయని చెపుతోంది.

 

ఇక మరో వైపు బీజేపీ, బ్రదర్ అనిల్ యొక్క బినామి సంస్థగా ఆరోపిస్తున్న బెనిటా ఇండస్ట్రీస్ ఎండీ వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా రంగంలో దిగి కడప, పెండ్లిమర్రి మైనింగ్ కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరభద్రారెడ్డి చేతిరాత ఫైళ్లను, ఆయన వివిధ సంస్థలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సేకరించి, ఆ సంస్థ అసలు యజమాని ఎవరో కనిపెట్టే పనిలోపడ్డారు.

 

వారు సేకరించిన ఫైళ్ళలో బ్రదర్ అనిల్ కు చెందినవిగా భావిస్తున్న రక్షణ స్టీల్స్, బయ్యారం గనులకు ఏమయినా లింకు దొరికినట్లయితే, అప్పుడు అనిల్ కుమార్ చెప్పినట్లు ఆయనను ఆ ప్రభువే కాపాడుకోవలసి ఉంటుంది.

 

అయితే, ఒకవేళ కీలక ఆధారాలు దొరికినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దానిని అవసరమయిన సమయంలోనే ఒక అస్త్రంగా వాడుకొని తన ప్రభుత్వం కాపాడుకొనే ఆలోచన చేసినా ఆశ్చర్యంలేదు. లేకుంటే, వేరే సమయంలో దానినే ఒక బ్రహ్మాస్త్రంగా చేసుకొని జగన్ మోహన్ రెడ్డి పై ప్రయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.