టీడీపీ, బీజేపీ.. డిష్యుం డిష్యుం

 

ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య క్లాష్ వచ్చింది. అదేంటి అని ఆశ్చర్యపోకండి. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఓ అంశంలో అధికారపార్టీతో విభేదిస్తోంది. అదే భూసేకరణ అంశం. రాజధాని కోసం భూసేకరణ చేపట్టాలన్న నిర్ణయంపై రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. అంతేకాదు తాము చెప్పినట్టు వినకపోతే ఆందోళన బాట పట్టడానికి కూడా వెనుకాడేది లేదని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎంతదాకా పోయిందో అర్థమవుతుంది.

 

రాజధాని కోసం రైతుల కోసం భూములు సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భూములు కోల్పోయే రైతులు నష్టపోకుండా వారి కోసం కొన్ని విధివిధానాలు ప్రకటించారు.  ఒక ఎకరం భూమి తీసుకుంటే... దాని బదులు ఎకరంలో 40 శాతం భూమిని  డెవలప్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు.  ఇలాంటివి పలు విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చింది. భూసేకరణలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 17 మండలాల్లో భూములను గుర్తించారు.  ఇందులో ఎక్కువ శాతం వ్యవసాయ భూములున్నాయి. ఈ భూములు పోతే దానిపై ఆధారపడి ఉన్న 40 వేల మంది వ్యవసాయ కూలీలు, అందులో 15 వేల మంది మహిళా కూలీలు బతకడం కష్టమైపోతుంది. వాళ్లకు ఎలాంటి ఆధారముండదు.  ఇలాంటి పలు కారణాల రీత్యా బీజేపీ భూసేకరణను వ్యతిరేకిస్తుంది.  ఒకవేళ భూసేకరణ చేయదల్చుకుంటే రైతులకు సరైన న్యాయం చేయాలని కమల నాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

   

బీజేపీ నేతల వాదనలోనూ అర్థముందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.  ఎందుకంటే ఒకవేళ రైతు నుంచి ఒక ఎకరా భూమిని తీసుకుంటే... దాని బదులు 40 శాతం డెవలప్ చేసిన భూమి ఇస్తామంటున్న ప్రభుత్వం అది ఎక్కడ ఇస్తుందో చెప్పలేదు.  దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అంతేకాదు ఎకరా భూమి బదులు.. 50 శాతం డెవలప్ చేసిన భూమి ఇవ్వాలంటున్నారు కమలనాథుడు. అది కూడా రాజధానిలోని కమర్షియల్ జోన్ లో... ఇక భూమి కోల్పోయే రైతులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. జీవనాధారం కోల్పోయే కౌలు రైతులు,  వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులకు ఆర్థికసాయం అందివ్వాలని కోరుతున్నారు.  ఇక నదీ తీరాన భూమలు కోల్పోయే రైతులకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.  ఇవన్నీ ఇచ్చి భూములు తీసుకుంటే అభ్యంతరం లేదని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.  ఒకవేళ బాబు ప్రభుత్వం తమను ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకెళ్తే ఆందోళన బాట పడుతామని హెచ్చరిస్తున్నారు. మరి చంద్రబాబు ఈ ఇష్యూను ఎలా హ్యాండిల్ చేస్తారు?  బీజేపీ నేతలు కోరినట్టుగా చేస్తారా?  తాను అనుకున్నదే చేస్తారా?  అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.