వాజ్‌పేయికి ‘భారతరత్న’ ప్రదానం

 

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లోనే జరుగుతుంది. అయితే సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్ వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ ఈ పురస్కారాన్ని అందించారు. వాజ్పేయి ఆరోగ్యం బాగాలేక పోవడంతో రాష్ట్రపతి స్వయంగా వెళ్లి ఈ పురస్కారం ఆయనకు అందించారు. జీవించి ఉండగా భారతరత్న అందుకుంటున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు వాజ్పేయి. రాజకీయాలలో ఎంతో చరిత్ర సృష్టించిన వాజ్‌పేయి ఈ విషయంలో చరిత్ర సృష్టించారు. భారతరత్న ప్రదానం కోసం శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రణబ్ ముఖర్జీ వాజ్పేయి ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు కూడా వాజ్పేయి నివాసానికి వెళ్ళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.