గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ కధేమిటో?

 

ఒకప్పుడు సినిమాలలో కామెడియన్ గా చిన్నచిన్న వేషాలు వేసే బండ్ల గణేష్, అకస్మాత్తుగా ఒకరోజున పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తెలుగు చిత్ర సీమలో ఉన్నఅందరు పెద్ద హీరోలు, అగ్ర దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మొదలు పెట్టినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి రావడంతో సినిమాలు తీయగలుగుతున్నానని ఆయన చెప్పినప్పటికీ, ఆయన వెనుక మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఒకప్పుడు హైదరాబాదు శివార్లలో కోళ్ళ ఫారం నడుపుకొని బ్రతికే బండ్ల గణేష్, తరువాత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొన్నపుడు, తన భూములతో ఆ వ్యాపారంలో ప్రవేశించడం నిజమే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసేంత డబ్బు సంపాదించడం మాత్రం నిజం కాకపోవచ్చును.

 

ఆయన మొట్టమొదట రవితేజతో తీసిన ‘ఆంజనేయులు’ సినిమా బోర్లాపడినప్పటికీ, వెంటనే పవన్ కల్యాణ్ తో ‘తీన్ మార్’ అనే మరో భారీ బడ్జెట్ సినిమా తీసాడాయన. కానీ, అది కూడా ఫ్లాప్ అవడంతో ఇక ఆయన పని అయిపోయినట్లే అని అందరూ అనుకొంటున్నతరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి విజయం సాదించారు. అయితే, రెండు వరుస అపజయాలు తట్టుకొని నిలబడటమే గాకుండా, మళ్ళీ వెంటనే మరో భారీబడ్జెట్ సినిమా ఎలా తీయగలిగాడని సినిమారంగంలో ప్రతీ ఒక్కరికీ సందేహాలొచ్చాయి, కానీ, బొత్స సత్యనారాయణ పేరు చూచాయగా వినిపిస్తుండటంతో ఎవరూ నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు.

 

‘గబ్బర్ సింగ్’ సినిమా మొదలు పెట్టిన వెంటనే, ఆయన జూ.యన్టీఆర్ తో ‘బాద్షా’ సినిమా, అల్లు అర్జున్ తో ‘ఇద్దరు అమ్మాయిలతో’ అనే మరో సినిమా కూడా మొదలు పెట్టడంతో, ఆదాయపన్ను శాఖ కళ్ళు బండ్ల గణేష్ పైన పడ్డాయి. నిన్న, ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఒకేసారి దాడి జరిపిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి నుండి కొన్ని కీలకపత్రాలు స్వాదీనం చేసుకొన్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయనను తమ కార్యాలయానికి పిలిపించుకొని వారు మరిన్ని వివరాలు సేకరించారు.

 

బండ్ల గణేష్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు, అందరూ గణేష్ కి, బొత్స సత్యనారాయణకి మద్య ఏదయినా రహస్య ఒప్పందాలు జరిగి ఉంటే, అవి బయటపడవచ్చునని భావించారు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారులు మాత్రం అటువంటివేవి దొరికినట్లు ఇంతవరకు ప్రకటించలేదు. అందువల్ల, ప్రస్తుతం కేవలం బండ్ల గణేష్ మాత్రమే ఆదాయపన్ను సమస్యలలో చిక్కుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒక వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు, బొత్స సత్యనారాయణ కూడా గణేష్ సినిమా వ్యవహారాల్లో ఉన్నట్లు కనిపెడితే మాత్రం అది బొత్సకు కొత్త సమస్యలు తేవడం ఖాయం.