కాయో పండో తేలని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కథ.. తయారీలో తప్పు జరిగిపోయిందట

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి నుండి కాపాడే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. సామాన్యులలో ఎంతో ఆసక్తిని రేపుతున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ గురించి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మాలు మరో సంచలన విషయం ప్రకటించాయి. తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో తప్పు జరిగిపోయిందని, దీంతో వ్యాక్సిన్ ట్రయల్స్ లో వచ్చిన ప్రాధమిక ఫలితాలు అనేక ప్రశ్నలను రేపాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తామిచ్చిన వ్యాక్సిన్ డోస్ లను తీసుకున్న వారిలో కరోనా నిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్ ఫర్డ్ ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, కొంతమంది వాలంటీర్లు రెండు డోస్ లను తీసుకున్నా, వారిలో వ్యాధి నిరోధకత పెంపొందలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనికా ఫార్మా స్పందించింది. ఆ వాలంటీర్లు తీసుకున్న వ్యాక్సిన్ తయారీలో తప్పు జరిగిందని తెలిపింది.

 

అసలు విషయం ఏంటంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను ఎదుర్కునే శక్తి ఎక్కువగా ఉందని, అయితే నిర్దేశించిన రెండు డోస్ లను తీసుకున్న వారిలో మాత్రం రోగనిరోధక శక్తి ఆశించిన స్థాయిలో లేదని తన ట్రయల్స్ ఫలితాల రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో 90 శాతం పనితీరు కనిపించిందని, అయితే రెండు డోస్ లను పొందిన వారిలో ఇది 62 శాతంగా నమోదైందని ఆస్ట్రాజెనికా వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ తో పాటు బ్రెజిల్ లోనూ ఈ వ్యాక్సిన్ పైన పెద్ద ఎత్తున ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా ఈ రెండు దేశాల్లో జరుగుతున్నా ట్రయల్స్ ఫలితాలను విడుదల చేయగా వాటిలో ఈ తేడాలు కనిపించాయి. దీంతో ప్రజలలో ఈ వ్యాక్సిన్ పై గందరగోళం నెలకొంటున్నది.