ఏపీ నెంబర్ ప్లేట్ మార్చాల్సిందే.. టీ సర్కార్
posted on Oct 16, 2015 12:20PM

రాష్ట్ర విభజన జరిగిన తరువాత పలు శాఖలు, పలు అంశాల్లో తెలంగాణ, ఆంధ్రా అంటూ మార్పులు జరిగాయి. ఇప్పుడు ఇదే తరహాలో నెంబరు ప్లేట్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో వాహనం రిజిస్టర్ అయితే.. ఏపీ స్టానంలో టీఎస్.. జిల్లా కోడ్ కూడా మారిపోగా నెంబరు మాత్రం అలాగే ఉంటుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అయితే గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నెంబర్ ప్లేట్ మార్పిడిపై నిర్ణయం తీసుకున్నా.. నెంబర్ ప్లేట్ల మార్పిడిపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో.. ప్రభుత్వం న్యాయసలహా తీసుకుని, అంతా సరే అనుకున్న తర్వాతే నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిసింది. 7 నెలల క్రితం తొలి నోటిఫికేషన్ జారీచేసి... ఇప్పుడు తుది నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 70 లక్షల వాహనదారులు రిజిస్టర్ చేసుకొని ఉండగా ఇప్పుడు వారందరూ నెంబర్ ప్లేట్ మార్చుకోవాల్సి వస్తుంది.
అయితే ఇప్పుడు కొత్త నెంబర్ ప్లేట్లను అమర్చుకోవానే నేపథ్యంలో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం మళ్లీ చలానా కట్టాలా? ఆర్‌టీఏ ఆఫీసుకు స్వయంగా వెళ్లాలా? లేక... ఆన్‌లైన్‌లోనే కొత్త నెంబర్ తీసుకోవచ్చా? కొత్త నెంబర్‌ను తీసుకున్నాక... ప్లేటుపై దానిని రాయించాలా? లేక, తనిఖీల సమయంలో డౌన్‌లోడ్ చేసుకున్న కాపీని చూపిస్తే సరిపోతుందా? ఇలాంటి సందేహాలెన్నో తలెత్తుతున్నాయి. వీటిపై స్పష్టత రావాలంటే ఇంక కొన్ని రోజులు ఆగాల్సిందే.