కాంగ్రెస్‌కి మెంటల్ ముదిరింది



కాంగ్రెస్ పార్టీకి మెంటల్ బాగా ముదిరినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మెంటల్ ఎక్కిందన్న ఉద్దేశంతోనే ప్రజలు ఏడాది క్రితం ఎన్నికల సమయంలో తరిమికొట్టారు. అయినప్పటికీ ఈ పార్టీ తన మెంటల్ చేష్టలు మానుకోవడం లేదు. ఇప్పుడు అటు దేశంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే, ఈ పార్టీకి మెంటల్ బాగా ముదిరిపోయిందన్న విషయం అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు సమాధి కట్టేశారు. ఆ సమాధిలోంచే ‘వదల బొమ్మాళీ’ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రంకెలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతర కృషి చేస్తు్న్న తెలుగుదేశం ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుతోంది. సరే, ఏదో ఉనికికోసం కాంగ్రెస్ నాయకులు ఇలా నోరు పారేసుకుంటార్లే అని క్షమించేయాలని జనం అనుకుంటున్నప్పటికీ ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే కాంగ్రెస్‌ని ఎప్పటికీ క్షమించకూడదని ఏపీ ప్రజలు డిసైడ్ అవుతున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో తలతిక్క పనిచేసింది. అసలు ఈ పని చేయడానికి మనసెలా ఒప్పిందో... జనం వెటకారంగా నవ్వుకుంటారని ఆ పార్టీ నాయకులకు కొద్దిగా కూడా అనిపించలేదా అనే సందేహం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొత్తం ఆరు వందల హామీలు ఇచ్చిందట. వాటిలో ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదట. అలా హామీలు నెరవేర్చనందుకు తెలుగుదేశం పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటువేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కి వినతిపత్రం ఇచ్చారు. ఇంత ముదిరిపోయిన మెంటల్ తరహా పని కాంగ్రెస్ పార్టీ మినహా మరో పార్టీ చేయగలదా?