రాజధాని ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాధికార సంస్థ విధి విధానాలు, ఛైర్మన్ తదితర సభ్యుల ఎంపిక కోసం మంగళవారం నాడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఛైర్మన్‌గా ఎన్నుకుంది. అలాగే ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీగా వ్యవహరిస్తున్న పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మారుస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో కంటే ఎక్కువ వ్యాధులను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైద్య సేవల ఖర్చు పరిమితిని రెండున్నర లక్షలకు పెంచింది. అలాగే 2004 తర్వాత బైరైటీస్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను కూడా మంత్రివర్గం రద్దు చేసింది. ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు మంగళవారం మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వీరు చంద్రబాబు నాయుడితో భేటీ అవుతారు. భూ సమీకరణకు సంబంధించి రైతులలో ఉన్న సందేహాలను చంద్రబాబు నాయుడు స్వయంగా నివృత్తి చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu