భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధం పట్టి తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం పోరాడిన యోధుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు. పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీ కొన్న అతడు ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని నిరూపించాడు. తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలు అర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలాడు. ఆయన జయంతి సందర్భంగా మరో సారి అల్లూరి పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ అక్షర నివాళులు..

తూర్పు గోదావరి జిల్లాలోపాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకట రామరాజు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం సీతారామరాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సాహిత్యం బాగా చదివేవాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. 1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద కొంతకాలం ఉన్నాడు.  లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలు చూసి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. దేశంలో మారుతున్న పరిస్థితులు ఆయనను స్థిరంగా ఉండనియ్యలేదు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి ఇంటికి చేరాడు. ఆరోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర.

పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కోసం అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది.

సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు.

మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ వచ్చాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. రాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలకు గురచేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని తన ప్రాణాలను 1924 మే 7న భారతమాత విముక్తి కోసం అర్పించాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్వతంత్య్రభారతావని చరిత్రపుటల్లో  ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. కృష్ణదేవిపేట(కే.డి పేట)లో ఆయన సమాధి యువతలో ధైర్యానికి నాంది పలుకుతోంది.