మళ్లీ పెళ్లికి భయపడుతున్నారా?? 

ప్రతి మనిషి జీవితంలో చదువు, ఉద్యోగం ఎంతటి ప్రధాన పాత్రలు పోషిస్తాయో పెళ్లి కూడా అంతే ప్రధాన  పాత్ర పోషిస్తుంది. చదువుకు, ఉద్యోగానికి ముందు, తరువాత అని మార్పు గూర్చి చెప్పుకున్నట్టే, పెళ్లికి ముందు తరువాత అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పెళ్లి కొందరి జీవితాల్లో చేదు జ్ఞాపకం అవుతుంది. ప్రమాదాలు కావచ్చు,  సమస్యలు కావచ్చు, కోల్పోవడం కావచ్చు, బందం మధ్య సరైన అవగాహన లేక  వదులుకోవడం కావచ్చు. కారణాలు ఎన్ని అయినా జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా మారడం  కాసింత తెలియని వెలితే. ముఖ్యంగా బయటకు చెబితే సమాజం ఏదో ఎదో అంటుంది కానీ శరీరంలో హార్మోన్ల గోలను భరించి ఆ ఒత్తిడిని మోయడం కూడా కష్టమే.

చాలామంది అటు సమాజం ఏమనుకుంటుందో  అనే భయంతో వెనకడుగు వేస్తూ తాత్కాలిక ఉపశమనం అన్నట్టు ఎవరితోనో ఒకరితో సంబంధం పెట్టుకుని వాటిని  అక్రమసంబందాలుగా ముద్ర వేసుకుని వాటిని కూడా గోప్యంగా ఒత్తిడిలో నెట్టుకొస్తూ అటు సమాజపరంగానూ, ఇటు  అంతరాత్మ పరిధిలోనూ నేరస్తులుగా తమని తాము పరిగణించుకుంటూ గడుపుతుంటారు. అయితే ఇలా మరొకరి  సాంగత్యం కోరుకునే వారు ఎవరైనా సరే తమకు తగిన వ్యక్తిని వెతుక్కుని పెళ్లి చేసుకోవడం ఎంతో ఉత్తమం. కానీ బయట నుండి ఎదురయ్యే మాటలే మిమ్మల్ని అలా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేసేలా చేస్తుంటే  మాత్రం ఒక్కసారి కింది ప్రశ్నలు వేసుకోండి.

మీరు సమాజంలో భాగమా?? లేక సమాజపు భారం మీ మీద ఉందా??

చాలామంది కొన్ని పనులు చేస్తే సమాజం దృష్టిలో విలువ లేని వాళ్ళు, ఉన్నత వ్యక్తిత్వం లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి మరియు వివాహ, శారీరక సంబంధ విషయాలలో ఒకానొక అసంబద్ధమైన ముద్రను వేస్తారు. అయితే ఎవరి జీవితం వారిది అయినపుడు, ఒకరి జీవితంలో నష్టం వాటిల్లినపుడు సమాజం ఏమి సహాయం చేయనపుడు, ఎవరూ ఇతరుల జీవితాలను మోయనపుడు ఇతరుల మాటలను అంతగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఏముంది?? విలువలు కానీ విషయాలు కానీ సమంజసం మరియు సమంజసం కానిదీ అనే విషయాలు కూడా వ్యక్తి ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నపుడు ఇతరుల మాటలకు భయపడి జీవితాన్ని అట్లా నిర్జీవంగా మరియు ఒత్తిడి వలయంలో కుదించేసుకోవడం అవసరమేనా??

అసంబద్ధమైన సంబంధాల కంటే ఆరోగ్యకరమైన బంధం ఉత్తమమెగా??

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుంది. గుట్టుగా జరిగే వ్యవహారాలు కూడా అలాంటివే. ఇంకా చెప్పాలి అంటే ఈ సమాజానికి ఎప్పుడూ వంద కాదు వెయ్యి కళ్ళు ఉంటాయి. వాటికి అవకాశం ఇచ్చి ఎవరి గౌరవాన్ని వారు తగ్గించుకోకూడదు కదా. దానిబధులు ధైర్యంగా బయటకు చెప్పుకోగల బంధం ఉంటే నిజంగా అది ఎంతో సంతోషించాల్సిన విషయం.

తోడు ఎందుకోసం??

సాధారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు కేవలం జీవిత భాగస్వామితో చెప్పుకునే సందర్బాలు కోకొల్లలు. ఆర్థిక, మానసిక, శారీరక ఇట్లా అన్నిరకాల విషయాలు భాగస్వామితో మాత్రమే చెప్పుకోగలరు. అట్లాంటప్పుడు అర్థం చేసుకునే వ్యక్గులను ఎంపిక చేసుకుని వారితో ఆనందంగా ఉండటం మంచిదే కదా!! అందుకే కదా తోడు  కావాలి మరి. 

సమాజం గురించి భయమా??

ఈ సమాజానికి ఇతరుల జీవితాల్లో తొంగిచూసి విమర్శ చేయడం వచ్చినంతగా మననుషులను అర్థం చేసుకోవడం రాదు.  నిజానికి ప్రస్తుత కాలంలో మనుషుల జీవితాలు, వారి బాధలు ఇవే పెద్ద ఎంటర్టైన్ అయిపోతున్నాయి. అట్లాంటప్పుడు సమాజం  ను చూసి భయపడటం ఎందుకు?? మళ్ళీ పెళ్లి అనేది ఎంతమాత్రం తప్పు కాదు. కాబట్టి కొందరు చిన్న వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయి పిల్లలు ఉన్నారనే కారణంతోనో లేక సమాజానికి భయపడో  మరింకేవో కారణాల వల్ల సహచర సాంగత్యాన్ని కోల్పోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.  కన్న తల్లిదండ్రులు, కడుపున  పుట్టిన పిల్లలు చుట్టాలు  అందరూ దూరం అయినా జీవితాంతం వెంట ఉండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే.  కాబట్టి ఆ తోడు ఉంటే, ఆ బంధం పటిష్టంగా ఉంటే జీవితంలో ఎన్నో గెలవగలుగుతారు. 

◆ వెంకటేష్ పువ్వాడ

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu