పరాజయం తర్వాత పశ్చాత్తాపం మంచిదే!

 

జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. ఎత్తుపల్లాలు రెండూ ఎదురుపడతాయి. కానీ పరాజయం ఎదురైనప్పుడు ఒకో మనిషి తీరు ఒకోలా ఉంటుంది. ఆ పరాజయాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడనే విషయమే అతని భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడీ కబుర్లన్నీ ఎందుకంటే... వైఫల్యంలో మనిషి ఎలా ఆలోచిస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఓ పరిశోధన జరిగింది కనుక.

ఓటమి ఎదురైనప్పుడు, మనిషిలో రకరకాల భావోద్వేగాలు మొదలవుతాయి. బాధ, పశ్చాత్తాపం, న్యూనత, తన మీద తనకి కోపం లాంటి భావాలు చోటు చేసుకుంటాయి. వాటితో పాటుగానే ఈసారి ఆ పని చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ప్రాక్టికల్‌ ఆలోచనలూ మొదలవుతాయి. అంటే! అటు మెదడు, ఇటు మనసు రెండూ కూడా మరోసారి సమస్యని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతాయన్నమాట.

చాలామంది మనసులోని భావాలను తొక్కిపెట్టేసి, కేవలం మెదడు చెప్పే మాటలే వినాలనుకుంటారు. అలా చేయడమే ప్రాక్టికల్‌ అనుకుంటారు. పరాజయం తర్వాత మనసులో మెదిలే భావాలన్నీ ఏమాత్రం ఉపయోగపడవని భావిస్తారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. దానికోసం కొందరు విద్యార్థులను ఎన్నుకొన్నారు.

పరిశోధన కోసం ఎన్నుకొన్న విద్యార్థులందరికీ ఒక పరీక్ష పెట్టారు. ఇంటర్నెట్‌ అంతా వెతికి, అతి చవకగా దొరికే మిక్సీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడమే ఆ పరీక్ష. ఒకవేళ ఆ పరీక్షలో విజయవంతం అయితే ఓ 50 డాలర్ల బహుమతి ఉంటుందని ఊరించారు. విద్యార్థులంతా ఆ పరీక్షలో విఫలమైపోయారు. ఈ పరాజయం తర్వాత విద్యార్థులకి మరో అవకాశం కూడా ఇచ్చారు. అయితే ఈసారి తమ మెదడు సూచించే ఉపాయాల మీద దృష్టి పెట్టమని కొందరికీ, తమ మనసులోని భావాలకి ప్రాధాన్యత ఇవ్వమని కొందరికీ సూచించారు.

ఆశ్చర్యంగా మనసుని విన్నవారు మరింత మెరుగైన ఫలితాలను సాధించడం కనిపించింది. మెదడు మీదే దృష్టి పెట్టినవారు ఈసారి పరాజయం పొందకుండా ఉండేందుకు చిత్రమైన ఉపాయాలను పన్నారట. దాంతో మొదటికే మోసం వచ్చేసింది. కానీ తమ భావోద్వేగాలని గమనించినవారు, మరింత జాగ్రత్తగా ఆటని ఆడే ప్రయత్నం చేశారు. క్రితంసారి తాము ఎక్కడ, ఎందుకు పరాజయం పొందామో వారికి తెలిసొచ్చింది. అది మేలైన ఫలితాలను అందించింది.

వ్యక్తిత్వ వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈరోజుల్లో పరాజయం తర్వాత మనసుని పట్టించుకోవద్ద అన్న మాటలు బాగా వినిపిస్తున్నాయి. కానీ అదేమంత మంచి పద్ధతి కాదని పై పరిశోధన తేల్చి చెబుతోంది. మనసుని కూడా కాస్త పట్టించుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు! ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు... పరాజయం పొందిన పిల్లలకి ఎలాంటి సూచనలు అందించాలో కూడా తెలియచేస్తోంది.

- నిర్జర.