లెక్క తేలింది.. గాల్వాన్ లోయలో వంద మంది చైనా సైనికులు మరణించారు!!

ఇతర దేశాలకు నష్టం కలిగించాలని చూసి, తానూ నష్టపోయి.. పైకి మాత్రం అబ్బే మాకేం నష్టం జరగలేదు అని చెప్పే దేశం ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు చైనా. ఇటీవల కరోనా కేసులు, గాల్వాన్ లోయ ఘర్షణలు వంటి విషయాల్లో అది మళ్ళీ రుజువైంది. పుట్టింటి నుంచి కరోనాను పంపించి ప్రపంచం వణికేలా చేస్తున్న చైనా.. ఆ దేశంలో లక్షల్లో నమోదైన కరోనా కేసులను దాచింది. అలాగే, గాల్వాన్ లోయ ఘర్షణలలో కూడా భారత్ సైనికుల చేతుల్లో చావుదెబ్బ తిన్న చైనా.. ఆ దేశ సైనికుల మరణాలను దాచింది.

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అయితే చైనాకు చెందిన సైనికులు ఎంతమంది మరణించారనేది ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, చైనాకు చెందిన సైనికులు 40 నుంచి 45 మంది వరకూ చనిపోయి వుండవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా చైనా నుంచే అసలు లెక్కలు బయటకు వచ్చాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా చనిపోయారని ఆ దేశానికి చెందిన పీపుల్స్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించిన ఆయన.. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరఫు నుంచి ఎన్నడూ బయటకు రాదని అన్నారు. భారత భూభాగంలోకి  చైనా సైన్యం వెళ్లిన తరువాత పెద్ద యుద్ధమే జరిగిందని, 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన ఆయన.. ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు భారత్ కే అనుకూలమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.