ఆశా వర్కర్లని కలిసిన కవిత.. పార్లమెంట్లో గళం విప్పుతా.. మరి అసెంబ్లీలో?
posted on Oct 12, 2015 1:27PM

తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చెపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం సరికదా.. వారు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా అడ్డుకొని దాదాపు తొమ్మిది వేలమంది నిరసన కారులను అరెస్ట్ చేసింది. కనీసం ప్రభుత్వాధినేతల్ని కలిసి తమ గోడును చెప్పుకుందామని కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లిన వారిని కూడా అడ్డుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు తలెత్తాయి. ఒక పక్క ఇప్పటికే రైతు సమస్యలతో అధికార పార్టీని ఇరుకున పెడదామని చూస్తున్న ప్రతిపక్షాలకు ఇదో కొత్త పాయింట్ దొరికింది.
అయితే ఈ వ్యవహారంలో అనవసరంగా తలనొప్పులు ఎందుకనుకున్నారేమో కేసీఆర్ కూతురు కవిత ఆశావర్కర్లని కలిశారు. వారి వాదనలను.. డిమాండ్లను ఓపికగా వినడం జరిగింది. వారి వాదనల విన్న తరువాత తాను వారి సమస్యలను తీరుస్తానని.. ఆవ్యవహారంపై పార్లమెంట్ లో తన గళం విప్పుతానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే కవిత బాధ్యతగా వారి దగ్గరకు వెళ్లడం.. వారి సమస్యలు వినడం అంతా బానే ఉంది.. ఈ విషయంలో ఆమెను ప్రశంసిస్తున్నారు కూడా. అయితే పార్లమెంట్ లో చర్చిస్తానని చెప్పిన ఆమె తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయంపై మాత్రం చెప్పలేదు. ఆమె కేంద్రంతో చర్చించి వారు స్పందించే లోపు కేసీఆర్ ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యలకు ఎంతోకొంత సాయం చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు.