ఫోర్బ్స్‌లో ఇండియన్ "ఉమెన్" పవర్..

అధికారాన్ని హస్తగతం చేసుకుని దేశాన్ని శాసించినా..కార్పోరేట్ రంగాన్ని పరుగులు పెట్టించినా భారత మహిళలు ప్రపంచంలో ఎవరికి తీసిపోరు. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచ్చర్, బయోకాన్ ఛైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా, హెచ్‌టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, ఛైర్ పర్సన్ శోభనా భారతీయ చోటు దక్కించుకున్నారు. బిలియనీర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, రాజకీయాలు, ఎస్‌జీవోస్, టెక్నాలజీ రంగాల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభాపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేసింది.

 

దేశంలోనే అతిపెద్ద, పురాతన బ్యాంక్ అయిన ఎస్‌బీఐకు తొలి మహిళా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అరుంధతీ భట్టాచార్య ఎస్‌బీఐని వృద్ధిలోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా టెక్నాలజీకి అనుగుణంగా..డిజిటల్ బ్యాంకింగ్ అవుట్‌లెట్, మొబైల్ వ్యాలెట్, ఇంటర్నెట్ బ్యాకింగ్ యాప్, ఈ-పే తదితర ఆధునాతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్థికరంగంలో శక్తిమంతమైన మహిళల జాబితాలో అరుంధతీ 5వ స్ధానంలో నిలిచారు. గత సంవత్సరం 10వ స్థానంలో నిలిచిన ఆమె..ఈ సారి 5వ స్థానంలో నిలిచారు. ఇక చందాకొచ్చర్ విషయానికి వస్తే 22 సంవత్సరాల వయసులో ఐసీఐసీఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన చందా సీఎండీ స్థాయికి ఎదిగారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఐసీఐసీఐని కీలకంగా మార్చేశారు. కిరణ్ మజుందర్‌షా, శోభనా భారతీయలు కూడా తమ తమ రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచారు. వీరంతా తమ శక్తియుక్తులతో, ప్రతిభా పాటవాలతో భారతీయ మహిళలంటే కేవలం వంటింటి కుందేళ్లని భావించే రోజుల్లోనే వ్యాపార రంగానికే వన్నె తెచ్చారు. ఎల్లలు లేని ప్రపంచంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ మహిళలు ఆదర్శం.