నిధుల లేమితో ఐ అండ్ వీఆర్ విలవిల
posted on Jun 20, 2012 11:57AM
ప్రభుత్వ పథకాల ప్రచారానికి సమాచార పౌరసంబంధాల శాఖ వెనకడుగు వేస్తున్నది. అసలు ప్రచారం నిర్వహించేందుకు ఈ శాఖ వద్ద ఏ ప్రతిపాదనా లేదని తేలిపోయింది. నిధుల లేమితో ఈ శాఖ సతమతమవుతున్నది. వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి గత ఏడాది జులై నుంచి బిల్లులు చెల్లించలేదని తెలుస్తున్నది. గత రెండు నెలలుగా ఉపఎన్నికల కొడ్ ఉన్నదని వివిధ పత్రికలకు ప్రకటనలు వాయిదా వేస్తూ ఆ శాఖ వచ్చింది. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక పత్రికలకు ప్రకటన ఇవ్వాలంటే ఆ శాఖకు నిధుల విషయం గుర్తుకు వచ్చింది. కొత్త కమీషనర్ వచ్చిన తరువాత డైరెక్టర్ స్థాయిలోనే ప్రకటనలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఐ అండ్ ఆర్ శాఖకు వందకోట్ల బడ్జెట్ కు బదులు కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేశారని, దీంతో బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. కొత్త అడ్వర్టయిజ్ మెంట్స్ ఇవ్వాలంటే నిధులు లేక విడుదల చేయడం లేదని తెలుస్తున్నది. ఈ విషయమై ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప ఈ శాఖ నుంచి ప్రభుత్వ ప్రకటనలు రావని తేలిపోయింది. చిన్న పత్రికలకు కనీసం 25,000 రూపాయలు ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పోటీ విపరీతంగా పెరగడంతో గ్రేడింగ్స్ ఇవ్వాలని గత ఏడాది ఆ శాఖ నిర్ణయించింది. ఈ గ్రేడింగ్ వ్యవహారం ఇప్పటివరకూ తేలలేదు. కొన్ని పత్రికలకు రేట్ కార్డు మంజూరు చేసినా వాటికి కూడా ఈ శాఖ నుంచి ప్రకటనలు విడుదల కాలేదు. అన్ని శాఖల్లో ఉండే ప్రకటనల నిధులను సమీకరించి ఐ అండ్ పిఆర్ ద్వారా విడుదల చేసి ఆ శాఖల ద్వారా బిల్లు చెల్లించాలన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు, నిధుల లేమితో ఆ శాఖ కుదేలవుతోంది. అయితే పత్రికల్లో ప్రకటనలు పక్కకు పెట్టి హోర్డింగ్ లకు మాత్రం ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఈ శాఖలో నిధులు లేనప్పటికీ క్షేత్ర స్థాయిలో ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడం గమనార్హం.