కొత్త ఆలోచనే విజయాన్నిచ్చింది

అడుగడుగునా అవరోధాలు, ఏం చేయాలో పాలుపోదు. అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒడిదుడుకుల దారి పడుతుంది. అలాంటి సమయంలో భవిష్యత్తుపై ఆశ ఏ మాత్రం మిగలదు. గుండెల్లో ధైర్యం మొత్తం సన్నగిల్లిపోతుంది. ఇప్పటి వరకు నడచిన ఈ దారి ముసుకుపోతు౦టే ఎలా ఏం చెయ్యాలని మథనపడతాం. కానీ ఎందరో జీవితాలలో వారికెదురైన అవరోథాలే వారిని ఓ కొత్త మార్గం వైపు మళ్ళించాయి. అలాంటి ఓ వ్యక్తి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం.

 

ఈరోజు మనం అనకపుత్తూర్ కు చెందిన శేఖర్ గురించి చెప్పుకోబోతున్నాం. చెన్నై సమీపంలో వుందీ ఊరు చేనేతకు పెట్టి౦దిపేరని చెప్పచ్చు. అయిదారు వేల మంది నేత కార్మికులకు అన్నం పెట్టే ఆ వృత్తి ప్రపంచీకరణ నేపధ్యంలో తన ప్రభావాన్ని కోల్పోయింది. చివరికి మెషిన్ల పోటీకి తట్టుకోలేక మగ్గాలు మూలనపడ్డాయి. నేతన్నలు కూలీలుగా మారారు. ఈ పరిస్థితులలో భవిష్యత్తు ఏంటో అర్థంకాలేదు.  శేఖర్ కి ఏం చెయ్యాలో తెలియలేదు కానీ ఏదో చేయాలని మాత్రం గట్టిగా అనుకున్నాడు. ఆలోచించగా ఒక్కటే తోచిందిట. " పోటీపడాలి " తనతో తను పోటీపడాలి. నిన్నటి తనకంటే ఈ నాటి తను, ఈనాటి తనకంటే రేపటి తను మెరుగ్గా ఉండాలంటే వైవిధ్య ఆలోచనలు చేయాలి. ఇలా ఆలోచించగా తను నార చీరలు తయారు చేస్తేనో అనుకున్నాడు.

నార చీరలు తయారు చేయాలని నిర్ణయించుకుని మొదట్లో అరటి, జనపనారలతో చీరలు తయారు చేశాడు. వాటి నాణ్యతపై పూర్తి నమ్మకం కుదిరాక ఊళ్ళోని మరి కొందరికి కూడా చెప్పి నార చీరల తయారీ మొదలు పెట్టాడు. ఒక్క చీరలే కాదు బ్యాగులు, దిండు గలీబులు, కార్పెట్లు, డ్రెస్ మెటీరియల్ ఇలా ఎన్నెన్నో వెరైటీల తయారీ ప్రారంభమయ్యింది. వైవిధ్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుందిగా! అమ్మకాలు చెన్నై నుంచి బెంగుళూరు, ఢిల్లీలకు విస్తరించాయి. ఇప్పటి వరకు ఎన్నో వేల అరటి నార చీరలు, కలబంద నార చీరలు అమ్మారు. ఆ చీరలు పెద్ద పెద్ద హోదాలలో వున్న వారిని కూడా విపరీతంగా ఆకర్షించాయి. మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కి కూడా శేఖర్ తయారు చేసిన నార చీరలు అందాయి, నచ్చాయి కూడా.

శేఖర్ ని అతను సాధించిన ఈ వినూత్న విజయం గురించి అతన్ని అడిగితే ''మన పని నాణ్యతగా ఉంటే ఆదరణ అదే వస్తుంది. ఏదీ ఎప్పటికీ ఆగిపోదు. ఆగింది అంటే మరోటి ఏదో మన కోసం రెడీగా వుందన్నమాటే. అదేంటో తెలుసుకోవటంలోనే మన విజయం దాగుంటుంది"అంటాడు. అనటమే కాదు ఒకటి తరువాత ఒకటిగా ప్రయోగాలు చేస్తూ అరటి, జనపనార, ఫైనాపిల్, కలబంద ఇలా వేర్వేరు నారలతో చీరలు తయారు చేస్తున్నాడు. తనతోపాటు ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాడు. కేవలం పాతతరం నేత పనికే పరిమితం కాకుండా ఈ కొత్త ఆలోచన చేయబట్టే అతనికి ఇంతటి విజయం దక్కింది.

తరతరాలనాటి వృత్తికి భవిష్యత్తు అంధకారమైతే భయపడలేదు, ఓ కొత్త ఆలోచన చేశాడు. దైర్యంతో ఓ అడుగు ముందుకు వేశాడు. విజయం అతని వెంట నడిచింది. సామాన్యుడు అసామాన్యంగా ఎదగటానికి ఈ ఒక్క సూత్రం చాలదూ. చరిత్ర చెప్పే సత్యం ఇదే. ఒక దారి మూసుకుపోతే పది దారులు తెరుచుకున్నట్టే, ఎదగటానికి అవకాశం దొరికినట్టే. అందుకే పరిస్థితులు పగపట్టాయంటూ నిందిస్తూ కూర్చునేకంటే వాటిని దాటే౦దుకు సన్నద్ధమయితే చాలు. కాలం సలాం చేసి మరీ విజయాలని మన గుమ్మంలో గుమ్మరించిపోతుంది. 

 

.........రమ