ఆజ్ఞాతంలోకి "అమ్మ"

వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అందుకోని తమిళనాడులో ఈ సారి ఆ సెంటిమెంట్‌ను తుడిచివేస్తానంటూ జయలలిత ప్రకటించారు. ఆమె అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలు చూసిన వారేవరైనా సరే అలాగే అనుకుంటారు. కాని వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు అమ్మకు షాక్ ఇచ్చాయి. ఐదు రాష్ట్రాలకు మొన్న జరిగిన ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి. దీనిలో ఒక్క దీదీ తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్న వారేవరూ రెండోసారి అధికారంలోకి రారంటూ సర్వేలు తేల్చాయి.

 

అలా ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వారిలో జయలలిత కూడా ఉన్నారు. సర్వే ప్రకారం ఆమె అధికారానికి దూరం కానున్నారు. ఈ ఎగ్జిట్‌పోల్స్ నేపథ్యంలో చెన్నై పోయిస్ గార్డెన్స్‌లోని సీఎం జయలలిత నివాసం మూగబోయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండటంతో అక్కడ నిశ్శబ్ధం తాండవిస్తోంది. పోలింగ్‌లో ఓటేసిన అనంతరం తన స్నేహితురాలు శశికళతో కలిసి జయ తన నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే పోలింగ్ తీరు తదితర అంశాలపై జయ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన ఆమె మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం తదితర కారణాలతో జయ కూడా ఓటమిని ఊహిస్తున్నట్లున్నారు. దీంతో గత రాత్రి నుంచి ఎవ్వరికీ అమ్మ దర్శనమివ్వలేదు. పోయిస్‌ గార్డెన్‌లోని తన ఇంటికి వచ్చిన కొందరు మంత్రులనూ ఆమె నిరాకరించినట్టు సమాచారం. మొత్తం మీద ఎగ్జిట్‌పోల్స్ అమ్మను ఆజ్ఞాతంలోకి నెట్టాయి.